మహానందికి ఆర్‌జేసీ హోదా
– గత ఐదేళ్లలో ఏడాది ఆదాయం రూ. 8 నుంచి రూ. 15కోట్లు
– అన్నదాన పథకానికి రూ. 1.70కోట్ల డిపాజిట్లు
మహానంది: రాష్ట్రంలో డిప్యూటీ కమిషనర్(డీసీ)స్థాయి కలిగిన ఐదు దేవాలయాల స్థాయిని పెంచేందుకు దేవాదాయశాఖ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నందన మహారాజులు, చాళుక్యరాజులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి రాజులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. క్షేత్ర అభివృద్ధికి ధర్మకర్తగా పనిచేసిన భైరవజోష్యుల మహానందయ్య ఎంతగానో కృషి చేశారు. మహానంది దేవస్థానానికి 6–02–1950న కార్యనిర్వహణాధికారి హోదా వచ్చింది. దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనర్(సహాయ కమిషనర్) హోదా 14–07–1989న వచ్చింది. అనంతరం అనతికాలంలోనే 5–07–2002 నుంచి అసిస్టెంటు కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయిని చేరుకుంది.
ఏటా పెరుగుతున్న ఆదాయం
మహానంది క్షేత్రానికి ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లల్లో రూ. 8 నుంచి రూ. 15కోట్ల స్థాయికి చేరింది. ఈ ఐదేళ్లలో ఒక ఏడాది మాత్రం రూ. 6.28 కోట్లు వచ్చినా ఐదేళ్ల వ్యవధిలో రూ. 7 కోట్లు ఏడాది ఆదాయం పెరగడం విశేషం. అధికారులు, సిబ్బంది ఇంకా కృషి చేస్తే ఏడాదికి రూ. 20కోట్లు వస్తుందని స్థానికులు, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ. 15కోట్ల ఆదాయం వస్తున్న క్షేత్రం జిల్లాలో రెండోది మహానంది మాత్రమే అని తెలుస్తుంది. బంగారు, వెండి ఆభరణాలు పరిశీలిస్తే మహానంది క్షేత్రానికి 821 గ్రాముల 893 మిగ్రా బంగారం, 102 కిలోల 815 గ్రాముల 550 మిల్లీగ్రాముల వెండి ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఇప్పటి వరకు సుమారు రూ. 1.70 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.
స్థాయి పెరిగితే మరింత అభివృద్ధి..
రీజనల్ జాయింట్ కమిషనర్( ప్రాంతీయ సంయుక్త కార్యనిర్వహణాధికారి) హోదా పెరిగితే భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వహణాధికారి స్థాయిలో కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆర్‌జేసీ హోదా వస్తే ఆర్‌జేసీ స్థాయిలో రూ. 10 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసి పనులు చేపట్టవచ్చు. అలాగే సిబ్బంది కొరత ఉంటే తన పరిధిలోనే ఏజేన్సీ, లేదా ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవచ్చు. ప్రతి చిన్నచిన్న పనులకు కమిషనర్ వరకు వెళ్లకుండా తనే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. పాలకమండలి సభ్యులు పెరుగుతారు. ఆలయ ప్రచారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.