ఖుద్దుస్‌నగర్‌లో రౌడీషీటర్ హల్‌చల్
పూర్ణానందపేట(విజయవాడపశ్చిమం) : స్థానిక ఖుద్దుస్‌నగర్‌లో అధికార పార్టీ నేతల అండతో ఓ రౌడీషీటర్ హల్‌చల్ చేసిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. ఖుద్దుస్‌నగర్ శివ కాళేశ్వరీదేవి ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు ఆలయానికి దగ్గరలో బ్యానర్ ఏర్పాటుచేశారు. అయితే ఆ స్థలంలో ఇంటింటికీ టీడీపీ బ్యానర్ ఉంది. ఆ కార్యక్రమం ముగిసి ఐదురోజులు గడిచింది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆ బ్యానర్‌కు ముందుగా దసరా పూజల వివరాలు తెలిపే బ్యానర్ ఏర్పాటుచేయగా స్థానిక టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు. స్థానిక టీడీపీ నాయకుల అండతో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు.
ఈ ప్రాంతంలో ఏం చేసినా తమ బ్యానర్లే ఉండాలని, అలా కాదంటే బ్యానర్లు ఏర్పాటుచేసినవారిని కూడా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించి, ఆలయ నిర్వాహకులను, భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో భయపడిపోయిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు టీడీపీ నాయకులతో మంతనాలు జరిపారు. అంతలో అక్కడి నాయకులు ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌చేశారు. ఆ నాయకుడు కూడా పోలీసులకు హెచ్చరికలు చేయడంతో చివరికి వారు ఆలయ నిర్వాహకులనే పిలిపించి బ్యానర్లను పక్కన ఏర్పాటుచేయాలని సూచించారు.