అంత్యపుష్కరాలకు ఆర్టీసీ, రైల్వే సిద్ధం
అంత్యపుష్కరాలకు ఆర్టీసీ, రైల్వే సిద్ధం
Published Tue, Jul 26 2016 10:09 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
జిల్లా వ్యాప్తంగా వంద బస్పులు
ప్రతి 15 నిమిషాలకో బస్సు
ప్రయాణికులకు కాంప్లెక్స్‌లో ప్రత్యేక షెల్టర్లు
ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్
రాజమహేంద్రవరం సిటీ : దూర ప్రాంతాల నుంచి అంత్య పుష్కర స్నానమాచరించేందుకు జిల్లాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ, రైల్వేశాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లాలోని 9 డిపోల నుంచి వంద ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి మరో రెండు వందల బస్పులు ప్రయాణికులను తీసుకుని రానున్నాయన్నారు. ప్రతి 15 నిమిషాలకు రాజమహేంద్రవరం నుంచి ప్రయాణికులను తీసుకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. నగరంలో షెల్టన్, తాడితోట, కంబాలచెరువు, గోకవరం బస్టాండ్, ఆర్యాపురం మీదుగా కోటిలింగాలఘాట్‌కు వెళ్లే వారి కోసం బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఈ బస్సులు ఇదే దారిలో తిరిగి కాంప్లెక్స్‌కు చేరుకుంటాయన్నారు. నగరానికి వచ్చే భక్తుల కోసం కాంప్లెక్స్‌లో ఉన్న ఐదెకరాల స్థలంలో షెల్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. 24 గంటలు తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. భక్తుల కోసం 50 మరుగుదొడ్లు సిద్ధం చేశామన్నారు. అంత్య పుష్కరాలకు తిరిగే బస్సుల్లో సాధారణ ధరలు మాత్రమే వసూలు చేస్తున్నామని రవికుమార్ స్పష్టంచేశారు.
రైల్వేస్టేషన్‌లో అదనంగా మూడు టికెట్ కౌంటర్లు
అంత్యపుష్కర భక్తులకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధాన రైల్వే స్టేషన్‌లో రెండు, తూర్పు రైల్వేస్టేషన్‌లో ఒకటి ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు.
Advertisement