ఆదమరిస్తే ఆగమే
♦ సాగర్ కాల్వల వెంట పొంచి ఉన్న ప్రమాదం
♦ సాగర్ కాల్వల వెంట పొంచి ఉన్న ప్రమాదం
♦ రెయిలింగ్ లేని పరిస్థితి రాత్రివేళల్లోనే ప్రమాదాలు
♦ పట్టించుకోని అధికారులు
కూసుమంచి : సాగర్ కాల్వల వెంట ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. ఖమ్మం-సూర్యాపేట రాష్ట్రీయ రహదారిపై నాయకన్‌గూడెం, పాలేరు గ్రామాల మధ్య నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా రోడ్డు వెంట ఉన్న కాల్వల్లోకి దూసుకెళ్లాల్సిందే. శుక్రవారం నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాలువ ప్రాంతంలో రహదారి ప్రమాదంగా మారటం తో ఆర్టీసీ బస్సు కాలువలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఎం.రాంబాబు (మహబూబ్‌నగర్),నర్సింహ(ఇనుగుర్తి), చిన్న కిష్టప్ప(మహబూబ్‌నగర్), చిన్నప్ప(మహబూ బ్‌నగర్), కృష్ణారెడ్డి(జడ్చర్ల), చలక ఉపేంద ర్(మధిర),విష్ణువర్థన్(కొత్తగూడెం), నరసింహ (హైదరాబాద్), నున్నా నవీన్ (పల్లిపాడు), కె.నిరీక్షణ్‌రావు(దమ్మపేట), అల్లం ప్రవీణ్ (పాల్వంచ), కృష్ణకుమారి(పాల్వంచ), కౌసల్య (పాల్వంచ), ముస్తఫా(హైదరాబాద్), వెంకటే శ్వర్లు(పాల్వంచ), చిట్టిబాబు(బస్సు డ్రైవర్), కొమ్ము శైలజ(వైరా, మృతిచెందిన బాలుడి తల్లి) ఉన్నారు.
నాయకన్‌గూడెం వద్ద హడల్..
నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాలువ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. కాలువ వద్ద మూలమలుపు ఉండటం.. అక్కడ వంతెన ఇరుకుగా ఉండటంతో వచ్చే వాహనాలను గుర్తించటం కష్టమవుతోంది. కాలువకు రెగ్యులేటరీ గేట్లు ఉండటంతో రిజర్వాయర్‌కు నీటిని వదులుతుంటారు. భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పాలేరు.. ప్రమాదకరం..
పాలేరురిజర్వాయర్ అవుట్ ఫాల్‌కాలువ, మినీ హైడల్‌కు నీరందించే కాలువల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువను తవ్వగా.. కాలువపై వంతెన నుంచే రాష్ట్రీయ రహదారి వెళ్తుంది. ఈ క్రమంలో కాలువ గేట్లవద్ద రోడ్డుకు అవతలి వైపు.. కాలువ ప్రారంభంలో రక్షణ గోడలు లేవు. రిజర్వాయర్‌ను, కాలువలను చూసేందు కు వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతంలో ప్రమాదకరమే. దీంతోపాటు రిజర్వాయర్ నుంచి మినీ హైడల్ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే కాలువకు ఉన్న వంతెన రెయిలింగ్ కూడా విరగటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 2014 లో డీసీఎం కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కొందరు వాహనదారులు కాలువలో పడిపోయారు. రాత్రి వేళల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగక నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.