ఇసుక ధరలకు రెక్కలు
♦ కొత్త పాలసీతో దళారులకు మేలు
♦ బినామీ పేర్లతో ఆన్‌లైన్‌లో బుక్కింగ్
♦ ఇళ్ల నిర్మాణదారులకు ఎక్కువకు అమ్మకాలు
♦ రూ. రెండు వేల వరకు అదనపు భారం
ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టి క్వారీ పాయింట్లకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం జిల్లాలో బీర్కూర్, హజ్గుల్, పొతంగల్, సిద్ధాపూర్, బండరెంజల్ ఇసుక క్వారీల్లో ఇసుక లభ్యమవుతోంది. ఆన్‌లైన్ బుకింగ్ పాలసీ ప్రకారం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. క్యూబిక్ మీటర్‌కు రూ. 600 చొప్పున చెల్లించి ఇసుకను పొందాల్సి ఉంది. ఆయా క్వారీల నుంచి ప్రస్తుతం రోజూ 150 నుంచి 200 లారీలు ఇసుక తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీలో 13.50 క్యూబిక్ మీటర్ల ఇసుక నింపుతున్నారు.
నిబంధనలు ఇవి
నిబంధనల ప్రకారం భవన నిర్మాణదారులే ఇసుక క్వారీల నుంచి ఇసుకను పొందాలి. ఆన్‌లైన్ బుకింగ్‌లో భవన నిర్మాణదారుడి పేరు, ఓటర్/ఆధార్/రేషన్ ఐడీ నంబర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి చిరునామా ఇవ్వాలి. అయితే కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో ఇసుకను బుక్ చేసుకుంటున్నారు. భవన నిర్మాణదారులు ఇసుక కోసం వస్తే నిబంధనల పేరుతో భయపెడుతున్నారు. లారీ యజమానులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు.
అప్పటికే లారీల యజమానులు బినామీ పేర్లతో ఇసుక బుక్ చేసుకుని, ఒక్కో లారీకి రూ. 8,100లు మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. ఇలా బుక్ చేసుకున్న ఇసుకను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులో ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను తరలిస్తున్నారా? లేదా? అన్న విషయమై విచారణ జరిపితే అసలు విషయం బయటపడే అవకాశాలున్నాయి. కానీ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, లారీ యజమానులతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కవడం వల్ల ఇసుక ధర భారీగా పెరిగింది.
దళారులకే లబ్ధి
ప్రభుత్వం ఇసుక ధరలను నిర్మాణదారులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కొత్త పాలసీని ప్రవేశపెట్టినా.. దళారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఇసుక లారీల యజమానులకే లబ్ధి చేకూరుతోంది. గతంలో ఇసుక క్వారీల్లో ఒక్కో లారీకి రూ. 16 వేల వరకు చెల్లించి ఇసుకను తరలించేవారు. ఇప్పుడు దళారులకు సగం ధరకే ఇసుక వస్తోంది. దానిని అమ్ముకుంటూ లబ్ధిపొందుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
మంజీర నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో భూగర్భ జలాలు సైతం పూర్తిగా తగ్గిపోతున్నాయి. తాగునీటికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భూగర్భ జల నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో సగటున 9.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తక్కువగా కురవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థితికి పడిపోయాయి. సర్కారు స్పందించి ఇసుక రవాణాను నిరోధించాలని ప్రజలు కోరుతున్నారు.