కన్నులపండువగా తెప్పోత్సవం
-
పంపానదిలో హంసవాహనంపై సత్యదేవుని విహారం
అన్నవరం:
క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపానదిలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు తిలకిస్తుండగా సత్యదేవుడు, అమ్మవార్లను హంసవాహనంపై మూడుసార్లు పంపానదిలో విహరింపజేశారు. మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులు, బాణసంచా కాల్పుల మధ్య, పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ తెప్పోత్సవం భక్తులకు నయనానందాన్ని మిగిల్చింది.
ఊరేగింపుగా పంపా తీరానికి స్వామి, అమ్మవార్లు
సాయంత్రం ఐదున్నర గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపానదీ తీరం వద్ద గల దేవస్థానం పవర్‌హౌస్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరోపక్క సీతారాములను ఉంచి పండితులు తులసీధాత్రి, తదితర పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్తి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజనమంత్రపుష్పాలు అందజేశారు. వేదపండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాత్రి ఏడు గంటలకు మొదలైన తెప్పోత్సవం
వేదికపై పూజలందుకున్న సత్యదేవుడు, అమ్మవార్లను రాత్రి ఏడు గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపానదిలోని హంసవాహనం మీదకు తీసుకువచ్చి అక్కడ గల ప్రత్యేక మందిరంలో ఉంచి పూజలు చేశారు. తరువాత పండితుల మంత్రోచ్ఛారణ మధ్య తెప్పోత్సవం ప్రారంభమైంది. హంసవాహనాన్ని పంపా నదిలో తూర్పు దిశగా ప్రయాణించి మూడు సార్లు ప్రదక్షణం చేసింది. ఈ సారి తెప్పపైకి కేవలం వైదిక సిబ్బంది, తెప్ప నడిపే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. కారణమేంటో తెలియదు కానీ ఈ సారి తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకాలేదు. తెప్పోత్సవం చివర్లో మాత్రం కాకినాడ ఎంపీ తోట నరసింహం వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. సుమారు వందమంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.