విత్తన పంపిణీకి 30 రోజులు
జిల్లాకు కేటాయించింది 4.01 లక్షల క్వింటాళ్లు
నెల రోజుల్లో 3.20 లక్షల క్వింటాళ్లే పంపిణీ
మరో మూడు రోజుల్లో ముగియనున్న గడువు
అనంతపురం అగ్రికల్చర్ : సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ 30 రోజులు పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజులవుతున్నా జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో 3.20 లక్షల క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీ చేశారు. బయోమెట్రిక్, సర్వర్ మొరాయింపుతో విత్తన పంపిణీ మందకొడిగా సాగుతోంది. గతంలో విడతకు మూడు రోజులు చొప్పున మూడు విడతల్లో 3 నుంచి 4 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఏడాది రైతుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, వరుస పంట నష్టాలతో వేరుశనగ సాగుకు ఆసక్తి చూపించకపోవడం, పెద్ద ఎత్తున నాసిరకం విత్తనం సరఫరా కావడం తదితర కారణాలతో విత్తన పంపిణీ కేంద్రాలు బోసిపోతున్నాయి. చాలా చోట్ల నాసిరకం కాయలు బహిర్గతమైనా ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం విశేషం. జిల్లాకు చేరిన విత్తనకాయలు ఎలాగైనా రైతులకు పంపిణీ చేయాలనే ఆలోచనతో మే 24న ప్రారంభమైన నాటి నుంచి నెలల తరబడి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో కొన్ని మండలాల్లో కొందరు దళారులు రంగప్రవేశం చేసి రైతులను సమీకరించి వారి చేతిలో చిల్లర పెట్టి విత్తనకాయలు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
బహుధాన్యపు కిట్ల పంపిణీనూ అరొకరే..
యాప్ సరిగా పనిచేయకపోవడంతో మొదటి పది రోజులు కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వాటిపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. నాణ్యత లేని కందులు, ఇతర చిరు ధాన్యాల విత్తనాల కిట్లు కూడా తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మొదట ఐదు లక్షల కిట్లు ఇస్తామని చెప్పగా తర్వాత మూడు లక్షల కిట్లు ఇస్తామన్నారు. తొలుత రైతుకు ఒక కిట్ అన్నారు.. తర్వాత ఐదు వరకు కిట్లు ఇస్తామని ప్రకటించారు. అయినా అనుకున్న విధంగా పంపిణీ కాకపోవడం విశేషం.
ఒకటో తేదీతో ముగియనున్న విత్తన పంపిణీ!
విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జూలై ఒకటో తేదీ ముగించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇంకా తీసుకోని రైతులు ఈ నెల 29, 30, జూలై 1వ తేదీల్లో ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా 30వ రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 561 మంది రైతులకు 648 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 18,655 మంది రైతులకు 2,130 క్వింటాళ్లు కందులు, 39,298 మంది రైతులకు 71,100 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. గురువారం కూడా ఏఓ కార్యాలయంలో విత్తన పంపిణీ కొనసాగుతుందన్నారు.
ఇపుడు కొత్తగా జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే భూసార పరీక్ష పత్రాల్లో సల్ఫర్ తక్కువగా ఉన్నట్లు సిఫారసు చేసిన రైతులకు ఉచితంగా ఇస్తామని ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. పత్రాలు ఇచ్చిన అధికారులు అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఏ రకం పోషకాలు ఎంత వాడాలనే అంశాల గురించి కనీస అవగాహన కల్పించకపోవడంతో భూసార పరీక్ష పత్రాలు అలంకార ప్రాయంగా ఉన్నట్లు చెబుతున్నారు.