ఆశలు ఆవిరి..
- వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైన ప్రొఫెసర్
- భారంగా మారిన వైద్యం
- సాయం కోసం ఎదురుచూపులు
బొబ్బిలి : తండ్రి రిక్షా కార్మికుడైనా ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని కాపాడుకోవాలనుకున్నాడు కొడుకు. కుమారుడి తాపత్రయం చూసి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని నిరంతరం శ్రమించి ఎంటెక్ వరకూ చదివించాడు. దీంతో కుమారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఒకవైపు అండగా ఉంటూ మరో వైపు తమ్ముడిని కూడా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. తండ్రి అకాల మరణం చెందినా కుటుంబానికి అండగా ఉన్నాడు.
అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆటో ప్రమాదం రూపంలో మెడ వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమయ్యూడు. కుటంబాన్ని ఆదుకోవాల్సిన కొడుకు మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యూయి. చదివించే అన్న లేకపోవడంతో తమ్ముడు చదువు మానేశాడు. మరో అన్న పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నారు. పట్టణంలోని ఆకుల రెల్లివీధికి చెందిన సురపల్లి శేఖర్ తండ్రి రాము రిక్షా కార్మికుడు.
ఇతని పెద్దకొడుకు విజయ్‌చందర్ పెయింటింగ్ పనులు చేస్తుండగా, శేఖర్ మాత్రం ఎంతో కష్టపడి తాండ్రపాపారాయ కాలేజీలో బీటెక్, విజయనగరం ఎంవీజీఆర్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. 2012లో చదువు పూర్తయిన తర్వాత బొబ్బిలిలో గోకుల్, తాండ్రపాపారాయ, అనకాపల్లిలోని ఇండో అమెరికన్ ఇనిస్టిట్యూట్‌ల్లో ఈసీఈ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పనిచేస్తూ తమ్ముడు రాకేష్‌ను లెండి కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో శేఖర్ బ్యాంకు ఉద్యోగాల కోసం శిక్షణ కోసం కర్నూల్ వెళ్లాడు.
తిరిగి ఏప్రిల్‌లో బొబ్బిలి వచ్చాడు. సమీప బంధువుల ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం వెళ్లి తిరగొస్తుండగా, రావివలస వద్ద ఆటో బోల్తాపడిన సంఘటనలో శేఖర్ మెడ వెన్నుపూస దెబ్బతింది. దీంతో శేఖర్‌ను విశాఖలోని ఓ గదిని అద్దెకుతీసుకుని వైద్యం చేయిస్తున్నారు. ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించడానికే రోజుకు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతోంది. అలాగే వైద్యం చేయించడానికి శేఖర్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. విజయ్‌చందర్ కూడా పనులకు వెళ్లకుండా తమ్ముడు శేఖర్ వద్దే ఉంటున్నాడు. ప్రస్తుతం విశాఖలోని రూమ్ అద్దెను కొంతమంది ఉపాధ్యాయులు చెల్లిస్తున్నారు. దయగల దాతలు సహకరించాలని శేఖర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వివరాలకు 73370 19927, 81215 38355 నంబర్లను సంప్రదించాలని కోరారు.
దాతలు కరుణించాలి
మా తమ్ముడు పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్నత చదువులు చదివాడు. కుటుం బాన్ని పోషిస్తాడనుకుంటే ఇలా జరిగింది. వైద్యం చేయించడం చాలా కష్టంగా ఉంది. దాతలు ఆదుకోవాలి.
- విజయచందర్, శేఖర్ సోదరుడు, బొబ్బిలి