గుడిలో కలకలం
గుడిలో కలకలం
Published Tue, Sep 20 2016 12:09 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
దేవాలయాల్లో వరుస చోరీలు
– పోలీసులకు పాత గ్యాంగ్‌ల సవాల్
– హుండీలపైనే దుండగుల దృష్టి
– జిల్లాలో రోజుకో చోట ఘటన
– డక్కల్, యానాది గ్యాంగ్‌ల కదలికలపై పోలీసుల నిఘా
– నెల్లూరు జిల్లా దొంగలపైనా అనుమానం
కర్నూలు: దేవాలయాల్లో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. దేవునిపై భక్తితో సమర్పించుకుంటున్న కానుకలను దుండగులు కాజేస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, షాద్‌నగర్, పెబ్బేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న డక్కల్ సవారీ గ్యాంగ్ గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2006 నుంచి రెండేళ్ల పాటు సవారీ గ్యాంగ్‌కు జిల్లాలో 50 పైగా దేవాలయాల్లో లూటీ చేసిన చరిత్ర ఉంది. అప్పట్లో అనేక మందిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆదోనిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ అప్పట్లో సంచలనం రేపింది. ఈ తరహా నేరాల్లో పట్టుబడిన పలువురికి ఒక్కొక్కరికి పన్నెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత సవారి మృతి చెందగా.. అతని అనుచరవర్గంతో పాటు చిన్న సవారి ముఠా జిల్లాలోకి ప్రవేశించినట్లు నేర పరిశోధన విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక డక్కల కులానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలు చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటే.. పురుషులు దేవాలయాల్లో చోరీలకు పాల్పడి జైళ్లకు వెళ్తుంటారని ఓ రిటైర్డ్ పోలీసు అధికారి వెల్లడించారు. జైలుకు వెళ్లిన దొంగలు ప్రస్తుతం ఎక్కడున్నారు? కదలికలేంటి? జీవనాధారం? తదితర విషయాలపై జిల్లా పోలీసులు దష్టి సారించకపోవడం వల్లే ఈ గ్యాంగ్‌లు చెలరేగుతున్నట్లు ఓ సబ్ డివిజన్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కర్నూలు వన్‌టౌన్ ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులకు బంధుత్వాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
నెల్లూరు గ్యాంగ్ కదలికలపై నిఘా
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సంజం మండల కేంద్రాల్లో కొంతమంది యానాది జాతివారు కూడా ముఠాలుగా ఏర్పడి దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంత దొంగల ముఠా కూడా జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ జిల్లా పోలీసు అధికారుల సహకారంతో దొంగల ముఠా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
రెండు నెలల్లో 50 దేవాలయాలకు పైగా లూటీ
జిల్లాలోని ఆళ్లగడ్డ, అహోబిలం, నంద్యాల, వెల్దుర్తి ప్రాంతాల్లో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు యథేచ్ఛగా దొరికినంత దోచుకున్నారు. రెండు మాసాల్లో 50 దేవాలయాల్లో హుండీలను, అమ్మవారి సొత్తులను కాజేశారు. వరుస చోరీలకు పాల్పడుతూ దుండగులు పోలీసులకు సవాల్ విసరడంతో వాటిని నియంత్రించేందుకు దృష్టి సారించారు. హుండీ పగులగొట్టాక తగినంత సొమ్ము దొరక్కపోతే వాటిని దూరంగా పారేస్తున్నారు. ఇలాంటి తరహా నేరాలకు పాల్పడే పాత నేరస్థుల జాబితాను సిద్ధం చేసి దుండగులను పట్టుకునేందుకు అన్వేషణ సాగిస్తున్నారు.
నెల్లూరు ముఠా కదలికలపై ఆరా తీస్తున్నాం
నందికొట్కూరు, ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి నెల్లూరు ప్రాంతంలో ఇలాంటి తరహా నేరాలకు పాల్పడటంతో కర్నూలు పోలీసుల సమాచారం మేరకు ఆ జిల్లా పోలీసులు ఒక గ్యాంగ్‌ని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారు, బెయిల్‌పై బయటకు వచ్చారా, వారి కుటుంబాల జీవనాధారం తదితర విషయాలపై నిఘా పెట్టాం. దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠా సభ్యుల గురించి ఇటీవలనే ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో చర్చించాం. ముఠాను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బందాలు పనిచేస్తున్నాయి. లభించిన ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
– హుసేన్ పీరా, సీసీఎస్ డీఎస్పీ
Advertisement
Advertisement