
ఏడాది నుంచి మూతే..
ప్రొద్దుటూరు క్రైం : ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు.. కానీ ఒక్క రోజు కూడా పని చేయలేదు. కార్యాలయం ఎప్పుడూ మూతపడి ఉండటాన్ని చూసిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత ఏడాది జూలై 28న ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జాతీయ పొగాకు నియంత్రణ ఆధ్వర్యంలో ‘పొగాకు ఉత్పత్తుల వాడకం, అలవాట్లు మాన్పించు కేంద్రాన్ని’ ప్రారంభించారు. దేశంలో ఈ కార్యక్రమం 100 జిల్లాల్లో ప్రారంభం కాగా అందులో కడప జిల్లాకు సంబంధించి ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. బీడీ, గుట్కా, సిగరేట్‌లకు బానిసైన వారిని ఈ కేంద్రానికి తీసుకొని వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించడానికి వైద్యాధికారులు కృషి చేస్తారు.
ఇందుకోసం ఒక నోడల్ అధికారి, ఇద్దరు కౌన్సెలర్లు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా కౌన్సెలింగ్ కేంద్రాన్ని అధికారులు తెరవలేదు. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కేటాయించలేదు. కౌన్సెలింగ్ కోసం తమ వారిని పిలుచుకొని వస్తున్న ప్రజలు అక్కడికి వచ్చి నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.