‘శ్రావణ’ సందడి
-
నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం
-
నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు
-
భక్తులతో కిటకిటలాడనున్న ఆలయాలు
తెలుగు నెలల్లో శ్రావణమాసానికి విశిష్టస్థానం ఉంది. మహిళలు ఈనెలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో తమ ఆరాధ్య దైవాలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరిన కోర్కెలు తీర్చాలని మనసారా వేడుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ‘శ్రావణమాసం’ ప్రత్యేకతను ఓసారి తెలుసుకుందాం.
హన్మకొండ కల్చరల్ : తెలుగు ప్రజలకు శ్రావణమాసం ఐదోవది. ఈ మాసంలో శ్రీకృష్ణభగవానుడు జన్మించాడని, హైగ్రీవోత్పత్తి జరిగిందని.. శ్రావణశుద్ధ పంచమి రోజే గరుత్మంతుడు అమృతభాండాన్ని సాధించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహా విష్ణువు కూడా శ్రవణా నక్షత్రంలోనే జన్మించాడని పేర్కొంటున్నాయి. శ్రీవైష్ణవ సంప్రదాయ గురు పరంపరకు చెందిన అళవందారు, బదరీ నారాయణ పెరుమాళ్, చూడికుడుత్తనాంచార్ తిరునక్షోత్రోత్సవాలను కూడా శ్రావణమాసంలోనే జరుపుకుంటారు. ఈనెలలో సంప్రదాయ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని భక్తుల నమ్మకం. రజకులు మడేలయ్యకు, గౌడ కులస్తులు కాటమయ్యకు బోనాలు, పండుగలు చేసుకుంటారు.
ప్రతి రోజు ప్రత్యేకమే
శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను భక్తులు పవిత్రంగా భావిస్తారు. శ్రావణ æసోమవారం శివుడికి, మం గళవారం గౌరీదేవికి, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులుగా భావిస్తూ ఆలయాల్లో ప్రత్యేకSపూజలు నిర్వహిస్తారు. మంగళవారం మంగళగౌరీ వ్రతాలను పాటిస్తే జన్మజన్మలకు అమంగళము కలుగకుండా ఉంటుం దని మహిళల విశ్వాసం. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు మొదటì ఐదేళ్లు మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. గురువారం సాయిబాబా ఆలయాల్లో అఖండ సాయినామయజ్ఞాలు జరుగుతాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకున్న వారికి పుణ్యంతో పాటు లక్ష్మీప్రసన్నం కూడా జరుగుతుందని, ధన, కనక, వస్తు, వాహనాలు సమకూరుతాయని, పూర్వకాలంలో చారుమతిదేవి అనే మహిళ ఈ వ్రతాన్ని పాటించి సకల సంపదలు పొందిందని మహిళలు నమ్ముతారు.
బంగారు నగ నియమం
శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు బంగారు నగ తప్పకుండా చేయించుకోవాలనేది నియమం. కొత్తగా వివాహామైన యువతులకు శ్రావణపట్టి పేరిట ఆభరణాలు చేయిస్తారు. శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసదీక్షలు పాటించి ఆలయాల్లో గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో నేతి దీపాలు వెలిగిస్తారు. ఇళ్లలో శ్రీవేంకటేశ్వరస్వామి జ్యోతి వ్రతాలు జరుపుకుంటారు.
శ్రీభద్రకాళి దేవాలయంలో..
వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీభద్రేశ్వరశివలింగానికి ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఓడిబియ్యం సమర్పణలు జరుగుతాయని ఈఓ కట్టా అంజనీదేవి తెలిపారు. అలాగే నాగ పంచమిరోజు ఆలయ ఆవరణలోని పుట్టవద్ద పూజలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వేయిస్తంభాల దేవాలయంలో..
హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలో ప్రతి రోజు శ్రీరుద్రేశ్వర శివలింగానికి సామూహిక రుద్రా భిషేకాలు, రుద్రాహోమాలు, అన్నపూజలు జరుగుతాయని ఈఓ వద్దిరాజు రాజేందర్ తెలిపారు. అలాగే ప్రతి సోమవారం మహా అన్నదానం, మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం వరలక్ష్మీవ్రతాలు, పంచమి తిథిరోజు నాగపూజలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, వరలక్ష్మీ వ్రతాన్ని వేయిస్తంభాల దేవాలయంలో మహిళలు సామూహికంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ∙