
ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య!
మెదక్: మెదక్ జిల్లా కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్‌లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్‌ఐ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తన భార్యను రెండు రోజుల క్రితం ఎస్‌ఐ పుట్టింటికి పంపారు. చనిపోయే ముందు ఇద్దరు కానిస్టేబుళ్లకు ఆయన ఫోన్ చేశారు. జాగ్రత్త నేను వెళ్లిపోతున్నా.. బాయ్ అంటూ రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతో కానిస్టేబుల్స్ ఇద్దరూ ఈ విషయాన్ని గజ్వేల్ ఎస్‌ఐ కమలాకర్‌కి ఫోన్ చేసి చెప్పారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డితో కమలాకర్ ఫోన్‌లో మాట్లాడారు. కమలాకర్ కుకునూరుపల్లి చేరుకోగానే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నారు.
తాను ఉద్యోగం మానేస్తానని నిన్న (మంగళవారం) రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనతో బక్కమంత్రగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రామకృష్ణారెడ్డి పుష్కరాలకు వస్తానని చెప్పాడని కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని బంధువులు, స్నేహితులు వాపోతున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదన్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉండగా, ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.