
పురపోరు నేడే
♦ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికలకు సర్వం సిద్ధం
♦ పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు
సిద్దిపేట జోన్: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలోని 28 వార్డులకు బుధవారం పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం పట్టణంలోని 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74.710 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంల పంపిణీ, సిబ్బందికి సామగ్రి అందజేత ప్రక్రియలను మంగ ళవారం పొన్నాల గ్రామ శివారులోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. 34 వార్డులకు గాను ఆరు వార్డులు టీఆర్‌ఎస్ ఖాతలో పడిన విషయం తెలిసిందే. మిగిలిన 28 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 8 జోనల్ అధికారులను, 8 రూట్లుగా విభజించి, 8 మంది అధికారులను రూట్ అధికారులను నియమించింది. ఈ ఎన్నికలను సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్ బాబు, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా విజయ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల అధికారిగా కమిషనర్ రమణాచారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ విధానం అమర్చారు. దీని ద్వారా ప్రతి క్షణం పోలింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించనున్నారు. అదే విధంగా రెండు పోలింగ్ స్టేషన్‌లను కలిపి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు.
సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను అధికారులు వీడియో చిత్రీకరించనున్నారు. ఎన్నికల సిబ్బందికి పట్టణ శివారులోని పొన్నాల ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.