
మేనబావ లేడని.. మరదలి ఆత్మహత్య
మేనబావ అంటే ఆమెకెంతో ఇష్టం.. కానీ అనుకోకుండా అతడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ యువతి తట్టుకోలేక పోయింది.
► జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడిన బావ
► మనస్తాపంతో తర్వాతి రోజే యువతి కూడా..
నవీపేట(బోధన్): మేనబావ అంటే ఆమెకెంతో ఇష్టం.. కానీ అనుకోకుండా అతడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ యువతి తట్టుకోలేక పోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని జన్నెపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌నాయక్ కథనం ప్రకారం.. జన్నెపల్లికి చెందిన బోడ శ్రీనివాస్, వాణి దంపతులకు కొడుకు నాగరాజు, కూతురు నందిని (19) ఉన్నారు. నందిని ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.
నందిపేట మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మేనబావ రచ్చ సాయికుమార్ అంటే ఆమెకెంతో ఇష్టం. అయితే, సాయికుమార్ జీవి తంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం నంది పేటలో జరిగిన అంత్యక్రియలకు నం దిని తల్లిదండ్రులు వెళ్లారు. అయితే, మేనబావ మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పూర్తిగా కాలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఇంటి నుంచి పొగలు రావడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.