ఠాణా ముందు బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
బంజారాహిల్స్: నగరంలో మరో సాఫ్ట్‌వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని సైబర్‌హైట్స్‌లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ సాఫ్ట్‌వేర్ సంస్థను తమకు జీతాలు చెల్లించకుండా మూసేశారని బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలన్నర రోజులుగా తమకు జీతాలు ఇవ్వకుండా సంస్థ సీఈఓ శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల వేధింపులకు గురి చేస్తున్నారని, జీతం అడిగితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
నాలుగు రోజుల క్రితం తాము ఆందోళన చేయగా గురువారం ఇస్తామని హామీ ఇచ్చి సంస్థకు తాళాలు వేసి అందుబాటులో లేకుండాపోయారని తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న 200 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు రూ. 1.25 కోట్ల జీతాలు బాకీ ఉన్నారని తెలిపారు. కొంతమందికి చెక్కులు ఇచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.