సాప్ట్‌వేర్ కన్సల్టెన్సీ బాగోతం
తిరుపతిక్రైం: ఐటీ రాజధాని బెంగళూరులో తమకు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉదని, అందులో ఉద్యోగం పొందేలా కోర్సులు నేర్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలుచేసిన కన్సల్టెన్సీ బాగోతామిది. చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సీఐ (ఈస్టు) రామ్‌కిషోర్ తెలిపిన వివరాలమేరకు..
తిరుపతి నగరంలో వీవీ మహల్ రోడ్డులోని ఓ భవనంలోని వెరిజోటెక్ ఐటీ సొల్యూషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విశ్వప్రసాద్ అనే వ్యక్తి విశాఖపట్నానికి చెందినవాడు. బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీకి అనుబంధంగా కన్సల్టెన్సీని 2015లో ప్రారంభించామని, ఇక్కడ కోర్సులు నేర్చుకుంటే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని 91 మంది నిరోద్యోగులకు ఆశ చూపాడు. జావా, ఎక్స్ ఎంఎల్ సర్వీసెస్, సీవీఎస్ లాంటి కోర్సులు నేర్పించి, సంవత్సరానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ప్యాకేజీ ఇప్పిస్తామని నమ్మించి చేర్పించుకునేవాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. అలా దాదాపు రూ.70 లక్షలు వెనకేశాడు.
విశ్వప్రసాద్ చేతిలో మోసపోయిన హరిప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెరిజోటెక్ బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని న్యూ ఇందిరా నగర్‌లో నివాసముంటున్న హరిప్రసాద్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెరిజోటెక్ లో చేరి, తర్వాత అతి బోగస్ సంస్థ అని తేలడంతో డబ్బులు వెనక్కివ్వాలని డిమాండ్ చేశాడు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరిగి విసుగెత్తిపోయి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు వెరిజోటెక్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అక్కడున్న కంప్యూటర్లలో ఏ ఒక్కటీ పనిచేయదు. కనీసం ఫ్యాన్లు కూడా తిరగవు. అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా తమ యజమాని కొద్దిరోజుల నుంచి కనిపించడంలేదని బదులిచ్చారు. మొత్తం 91 మంది బాధితుల బయోడేటాలు, కంపెనీకి సంబంధించిన ప్యూచర్‌ప్లాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఒక కార్యాలయంగా చిత్రీకరించనట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటి వరకు ఒక బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేశాడని, మిగతావారుకూడా ముందుకొచ్చి ధైర్యంగా ఫిర్యాదుచేయాలని కోరారు.