ఆ విషయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త..
విజయవాడ : ఓ యువతి అసభ్యకర ఫొటోలను మెయిల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఆమెను వశపరుచుకునేందుకు బ్లాక్‌మెయిల్ చేసిన చెన్నయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను విజయవాడ సైబర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీసు కమిషనర్ పి.హరికుమార్ వెల్లడించిన వివరాలివీ.. విజయవాడకు చెందిన ఓ యువతికి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శశిధరన్ (27) నెల రోజులుగా అసభ్యకర ఈ-మెయిల్స్ పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే తన వద్ద ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడు. చివరకు ఆమె నగర పోలీసు కమిషనర్‌కు తాను పడుతున్న ఇబ్బందులను ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసింది. సీపీ గౌతం సవాంగ్ స్పందించి విజయవాడ సైబర్ సెల్ పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో అనేక ఆసక్తికర అంశాలు తెలిశాయి. శశిధరన్ తన పాత్ర బయటపడకుండా ఉండేందుకు సైబర్ కిటుకులను ఉపయోగించాడు. రెడిఫ్ మెయిల్‌ను వినియోగించడంతోపాటు మెయిల్ క్రియేట్ చేసే సమయంలో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
సైబర్ పోలీసింగ్ సెల్, రెడిఫ్ మెయిల్, హాట్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నిందితుడు శశిధరన్ వినియోగించిన ఐపీ అడ్రస్, మాక్ అడ్రస్, ఇంటి చిరునామా, ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్ నంబరు, బెంగళూరులో పనిచేసే కంపెనీ వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. విజయవాడ యువతి గత ఏడాది బెంగళూరులో నిందితుడు పనిచేస్తున్న కంపెనీలో నాలుగు నెలలు ఇంటర్న్‌షిప్ చేసినట్లు పోలీసులు వివరించారు. ఆ సమయంలో నిందితుడు బాధితురాలి జి-మెయిల్, ఫేస్‌బుక్ వివరాలు తీసుకుని, ఆమె పర్సనల్ ఫొటోలను గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు రకరకాల పట్టణాల నుంచి ఈ-మెయిల్స్ పెట్టి ఆమెను వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏడేళ్ల కిందట వినియోగించి మనుగడలో లేని ఫోన్ నంబర్‌ను మెయిల్‌లో ఉంచడంతో దాని ఆధారంగా అతడిని గుర్తించగలిగినట్లు పోలీసులు చెప్పారు.
అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త
అపరిచిత వ్యక్తులను నమ్మి మెయిల్ అడ్రస్‌లు ఇవ్వవద్దని జాయింట్ కమిషనర్ హరికుమార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మెయిల్ ఐడీలు, ఇతర వివరాలు చెప్పవద్దని ఆయన కోరారు.