జన్మభూమి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జన్మభూమి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
Published Wed, Feb 1 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
రెవెన్యూ అధికారుల సమీక్షలో జేసీ సత్యనారాయణ
కాకినాడ సిటీ : జన్మభూమి నాలుగో విడతలో ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కాకినాడ, పెద్దాపురం డివిజన్ల ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి, మీ–కోసం కార్యక్రమాల్లో అందిన అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. కాలపరిధి దాటిన ఎఫ్‌లైన్ పిటిషన్లన్నింటినీ సత్వరం పరిష్కరించాలన్నారు. ఈ –పాస్ పుస్తకాలు, మ్యూటేషన్లు, ల్యాండ్ కన్వర్షన్, అడంగళ్ కరెక్షన్లు, అంశాల్లో పురోగతి ముమ్మరం చేయాలని, నీటి తీరువా వసూళ్లు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, క్షేత్ర సిబ్బంది అందరూ భీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాడడంతో పాటు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. నగదు రహిత లావాదేవీలపై డివిజన్ స్థాయిలో వర్తకులకు రెండో విడత కార్యక్రమాలను నిర్వహించి, బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయాలన్నారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు రూ.22 కోట్ల మేర నగదు రహిత లావాదేవీలు జరగ్గా, రైతులు రూ.3.45 కోట్ల విలువైన ఎరువులను కొనుగోలు చేశారన్నారు. అలాగే రూ.2.18లక్షలు మేరకు మద్యం విక్రయాలు కూడా ఈ పద్ధతిలోనే జరిగాయని, జిల్లాలో నగదు రహిత లావాదేవీల స్థాయి క్రమేణా పెరుగుతోందన్నారు. జూన్ మాసాంతానికి జిల్లాను పొగరహిత జిల్లాగా మలిచేందుకు దీపం వంట గ్యాస్ పంపిణీ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ నిధులను ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పూర్తిగా వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ వి.రవికిరణ్, డీఎం సివిల్ సప్లయిస్ కృష్ణారావు, కాకినాడ ఆర్‌డీఓ ఎల్.రఘుబాబు, పెద్దాపురం ఆర్‌డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు, ఎండీఓలు పాల్గొన్నారు.
Advertisement