జన్మభూమి నిరసనల పర్వం
- టీడీపీ కార్యక్రమంగా మారిన వైనం
- ఆదోనిలో పార్టీ ఇన్‌చార్జ్ ఆధ్వర్యంలోనే సభలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో జన్మభూమి కార్యక్రమం నిరసనలు, అసంతృప్తుల మధ్యనే రెండవ రోజు పూర్తి చేసుకుంది. ఇంత వరకు మూడు విడతలుగా జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు దిక్కులేకుండా పోయిందంటూ ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. జిల్లాకు సంబంధించి రెండవ రోజు సోమవారం 95 గ్రామాలు, 28 వార్డుల్లో సభలు జరిగాయి. మొత్తంగా 247 పంచాయతీలు, వార్డుల్లో కార్యక్రమం ముగిసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లపై వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కార్యక్రమంలో కొత్త పింఛన్‌ల పంపిణీ ఊసే లేకపోవడం గమనార్హం. పాత పింఛన్‌లనే పంపిణీ చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఆదోని, బనగానపల్లి, బేతంచెర్ల, డోన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీ«శారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం అధికార పార్టీ కార్యక్రమంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో జరుగుతుండడం గమనార్హం. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ సభలు జరగాల్సి ఉండగా ఆదోనిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ నిర్వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆళ్లగడ్డలో టీడీపీ గ్రూపు రాజకీయాలు జన్మభూమి వేదికగా బయట పడ్డాయి. ఒక వర్గం మాత్రమే క్రియాశీలకంగా పాల్గొంటుండగా మరో వర్గం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.