అల్లుడి ఘాతుకం
- అత్తగారింటిని లారీతో గుద్ది భార్య, బిడ్డతో సహా అందరినీ హతమార్చే యత్నం
- ఇంటి గోడలు కూలి అత్తకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
- తృటిలో తప్పించుకున్న ఐదుగురు
- మారెంపల్లిలో అర్థరాత్రి అలజడి
- పట్టుకునేలోగా పరారైన నిందితుడు
గుమ్మఘట్ట (రాయదుర్గం) : రెండు కుటుంబాల్లో తలెత్తిన చిన్న వివాదంతో ఓ వ్యక్తి బంధం, బంధుత్వాలు మరచి క్రూరమృగానికన్నా క్రూరంగా మారిపోయాడు. కట్టుకున్న భార్య, బిడ్డతో సహా ఆమె కుటుంబీకులను అందరినీ మట్టుపెట్టేందుకు ఒడికట్టాడు. ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం మేరకు... రాయదుర్గం మండలం డీ కొండాపురానికి చెందిన గొల్ల చంద్రశేఖర్‌కు మూడేళ్ల క్రితం గుమ్మఘట్ట మండలం మారెంపల్లికి చెందిన గొల్ల తిమ్మారెడ్డి కుమార్తె మారెక్కతో వివాహమైంది. రెండు కుటుంబాలవారూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇరు కుటుంబాల వారూ సర్దుకున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం మారెక్క మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు గాడిద పాలు పడితే మంచిదని భర్తకు చెప్పడంతో పిల్లాడి నాయనమ్మ గాడిదపాలు తీసుకొచ్చింది. అవి తాగించాక రెండు, మూడు రోజులు పిల్లాడు మల విసర్జన కాక ఇబ్బందిపడ్డాడు. వైద్యం చేయించడంతో నయమైంది. అయితే పిల్లాడి నాయనమ్మ పాలలో ఏదో కలిపిందని, అందువల్లే మలవిసర్జన కాలేదని పిల్లాడి అమ్మమ్మ వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు.
అది ఆనోటా ఈనోటా పడి నాయనమ్మకు తెలిసింది. ఆగ్రహించిన ఆమె మారెంపల్లికి వచ్చి కోడలు, ఆమె కుటుంబసభ్యులను నిలదీసింది. దీంతో గొడవ జరిగింది. గ్రామస్తులు సర్ధి చెప్పారు. ఈ విషయం తెలిసి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. లారీ డ్రైవర్ అయిన ఆయన లోడ్ తీసుకెళ్లే లారీతోనే శుక్రవారం రాత్రి అత్తగారింటికి వచ్చి అత్త, భార్య, బావమరుదులతో గొడవ పడ్డాడు. మీ అంతు చూస్తానని, మిమ్మల్ని చంపి తీరతానని బెదిరించి వెళ్లాడు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయానికి అన్నంత పనీ చేసేందుకు పూనుకొన్నాడు. లారీని తీసుకొచ్చి రివర్స్‌గేర్‌లో అత్తగారింటిని గుద్దేశాడు. ముందు గోడ, బయట వేసిన షీట్లు కుప్పకూలిపోయాయి. గోడ పక్కన నిద్రిస్తున్న అత్త గంగమ్మ(40) కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన మరో ఐదుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అంతేకాకుండా చంద్రశేఖర్ ఆరు బయట నిద్రిస్తున్న బావమరిది అంజినేయులుపై కత్తితో దాడి చేసేందుక్కూడా యత్నించాడు. ఈ ఘటన గ్రామంలో పెద్ద అలజడి సృష్టించడంతో అందరూ ఇళ్లు వదిలి గ్రామస్తులు రోడ్లపైకి పరుగుపెట్టారు. అంతమంది జనాన్ని చూసి భయపడిన నిందితుడు పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన గంగమ్మను చిక్సిత కోసం హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుమ్మఘట్ట ఎస్‌ఐ హైదర్‌వలీ తెలిపారు.