పోలీస్‌శాఖలో అవినీతిని సహించను..
పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉంది
పరిస్థితులను అవగాహన చేసుకుంటూ చర్యలు చేపడతా
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై దృష్టిసారిస్తా
జిల్లా ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ క్రైం : పోలీస్‌శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అవినీతిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో 79వ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశ్వీరచనాల నడుమ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నక్సల్స్, అసాంఘిక, నేర కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటానన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పోలీసులతో ప్రజా సంబంధాల మెరుగుకు కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళిక..
నర్సీపట్నంలో ఓఎస్డీగా పనిచేసిన అనుభవంతో జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను జిల్లా పోలీస్ కార్యాలయంలో కలుసుకోవచ్చన్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను, అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తిమ్మాపురంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడులను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.
ఎస్పీ నేపథ్యమిది..
విశాల్ గున్ని సొంత రాష్ట్రం కర్నాటక
2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయనను 2013లో ప్రభుత్వం నర్సీపట్నం ఓఎస్డీగా నియమించింది. అనంతరం 2014 ఆగస్టులో విశాఖ రూరల్ ఏఎస్పీగా వెళ్లారు. అక్కడ దాదాపు రెండేళ్లపాటు పనిచేశాక మార్చి 2016 సంవత్సరంలో పదోన్నతిపై నెల్లూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. అక్కడ ఏడాదిన్నర పాటు పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు.
నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో డయల్ యువర్ ఎస్పీ, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి మన్ననలు పొందారు. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ని నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ గ్రౌండ్ ఆధునికీకరణకు అధిక నిధులు మంజూరు చేయించారు. యువతను ఆకర్షించేందుకు పలు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు.