మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారు, బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిపై జరిమానాలు విధించేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ జరిమానాల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ–చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నుంచి చెత్త తరలించే వారికి అందజేసిన 1830 ఆటోట్రాలీలకు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. అవసరాలకు అనుగుణంగా కొత్త ఆటోలకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
నిర్వాహకులే తరలించాలి
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లనుంచి వెలువడే వ్యర్థాలను నిర్వాహకులే తరలించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యాలకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సేంద్రియ ఎరువుల పిట్‌లను ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏఎంఓహెచ్‌లకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.