ప్రత్యేక హోదా రాష్ట్రానికి వరం
-
ప్యాకేజీతో హోదాను తుంగలో తొక్కారు
-
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చంద్రబాబు పోకడలు
-
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
విడవలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వరం లాంటిదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విడవలూరులో శనివారం నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడంతో చంద్రబాబు విఫలమయ్యాడు. హోదాను తన స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ వేసి గొంగళిలా అక్కడే ఉంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ కలగానే మిగిలిందన్నారు. రాష్ట్ర విజభన సమయంలో ఇచ్చిన హామీలను మరుగున పరచారన్నారు. వీటిని వెలుగులోకి తీసుకువస్తున్న వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాను రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో బయటపడుతుందన్నారు. ఇటీవల కొందరు నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు వైఎస్సార్‌సీపీకి 112 సీట్లు, టీడీపీ 63 సీట్లు వస్తాయని చెప్పడం జరిగిందన్నారు. చంద్రబాబు ఎలక‌్షన్ రిగ్గింగ్‌లో గొప్ప మేధావని, రకరకాల ఎత్తుగడలు వేసి ప్రజలను మోసం చేయగల వ్యక్తి అని చెప్పారు.ఽ గత ఎన్నికల్లో ఆకాశమే హద్దుగా వాగ్దానాలను చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడకే ముప్పు ఉందని, శక్తికి మించి వాగ్దానాలను చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఇలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అడిగితే ప్రతిపక్షాలను టీడీపీ వారు విమర్శించడం దారుణమన్నారు. త్వరలోనే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నాయకులు బెజవాడ గోవర్దన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య, నలబోలు సుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులరెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు వెంకట సుబ్బారెడ్డి, బాలశంకర్‌రెడ్డి, మాతూరు శ్రీనివాసులరెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.