దోపిడీపై దర్యాప్తు ముమ్మరం
కంకిపాడు :
ఇన్‌కం టాక్స్ అధికారుల పేరిట బెదిరించి చేపల వ్యాపారి నుంచి రూ.17.50 లక్షల నగదు దోచుకున్న వారిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీ సేకరణపై దృష్టి పెట్టారు. క్రైమ్ అదనపు డీసీపీ, ఇతర అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీ లించి, బాధితుడిని విచారణ చేశా రు. కైకలూరుకు చెందిన చేపల ఎగుమతి వ్యాపారి చొక్కారపు శ్రీనివాసరావు సోమవారం ఉదయం విజయవాడ వచ్చారు. రామవరప్పాడు, ఆటోనగర్ ప్రాంతాల్లో చేపల వ్యాపారానికి సంబంధించిన సొమ్ము రూ.17.50 లక్షలు వసూలు చేసుకుని కారులో తిరిగి కంకిపాడు మీదుగా కైకలూరు బయలుదేరారు. పునాదిపాడు చెరువు కట్ట దాటిన తరువాత కోమటిగుంట–కోలవెన్ను లింకు రోడ్డు మార్గానికి చేరుకునే సరికి వ్యాపారి వాహనాన్ని అనుసరిస్తూ వచ్చిన ఎర్ర బల్బు ఉన్న కారును అడ్డుగా ఆపారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తాము ఇన్‌కంటాక్స్ అధికారులమని చెప్పి శ్రీనివాసరావు వాహనాన్ని తనిఖీ చేసి అందులో ఉన్న రూ 17.50 లక్షలు నగదును తీసుకున్నారు. మిగిలిన విషయాలు వన్‌టౌన్‌లో మాట్లాడేందుకు తమ వాహనాన్ని అనుసరించి రావాలని వారు శ్రీనివాసరావుకు చెప్పారు. మార్గమధ్యంలో శ్రీనివాసరావు ఎర్రబల్బు ఉన్న వాహనం జాడ గుర్తించలేకపోయారు. వన్‌టౌన్‌లో గాలించినా ఫలితం లేకపోవడంతో 12 గంటల సమయంలో బాధితుడు శ్రీనివాసరావు కంకిపాడు సీఐ శ్రీధర్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
170, 392 సెక్షన్‌ల కింద కేసులు
దోపిడీ ఘటనపై విజయవాడ ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్ మంగళవారం తెల్లవారుజామున పోలీసు స్టేషన్‌ను సందర్శిం చారు. బాధితుడిని విచారించి వివరాలు సేకరించారు. నగదు లూటీపై 170, 392 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. క్రైమ్ అదనపు డీసీపీ రామకోటేశ్వరరావు, సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ హనీష్ తెల్లవారుజామున 6 గంటల సమయంలో నగదు లూటీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఈడుపుగల్లు, గోసాల సెంటరు, కంకిపాడు, పునాదిపాడు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పలు సీసీ కెమెరాల పుటేజీని అధికారులు సేకరించే పనిలో పడ్డారు. సీసీ పుటేజీ పరిశీలించి ఎర్ర బల్బు ఉన్న కారులో ఎవరు వచ్చారు? ఏ మార్గంలో వెళ్లారు? అనే అంశాలను పరిశీలించి కేసు దర్యాప్తు మరింత వేగిరం చేసేందు కు శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ హనీష్ తెలిపారు.