వడివడి.. నడికుడి
వడివడి.. నడికుడి
Published Tue, Aug 8 2017 4:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM
ఉదయగిరి : నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 14 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తి కాగా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూసేకరణకు సంబంధించి ముమ్మరంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాల్లోనూ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పలుచోట్ల నిర్మాణ సామగ్రిని ఇప్పటికే సిద్ధంగా ఉంచారు.
మార్గం ఇలా..
నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 309 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి మొదలై చావళ్యపురం, నగిరేకల్లు, రొంపిచర్ల, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు మీదుగా వెంకటగిరి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ మార్గంలో 69 వంతెనలు నిర్మించనున్నారు. రాజుపాళెం మండలం కుండమూరు సమీపంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి, నగిరేకల్లు మండలం అద్దంకి వద్ద, నార్కేడ్‌పల్లి రహదారిపై త్రిపురాంతకం వద్ద అండర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు.
దూరం తగ్గుతుంది
ఈ రైల్వే లైన్ వినియోగంలోకి వస్తే హైదరాబాద్–తిరుపతి నగరాల మధ్య దూరం బాగా తగ్గుతుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత గల ఈ మార్గం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి పెట్టింది. 2018 చివరి నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2020 నాటికి పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఫలించిన కషి
గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ నుంచి మూడు జిల్లాలను కలుపుతూ మెట్ట ప్రాంతవాసులకు సౌకర్యంగా ఉండేలా శ్రీకాళహస్తి వరకు రైల్వే మార్గం నిర్మించాలని ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఎంపీలు, ప్రజాప్రతినిధులు గళం వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ లైన్ నిర్మాణానికి ఎంతో కషి చేశారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి పలుమార్లు పార్లమెంట్‌లో దీని ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ లైన్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అవసరమైన భూమిని తామే సేకరించి ఇస్తామని, ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం నిధులు భరిస్తామని కేంద్రానికి తెలియజేశారు. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ లైన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంకల్పించింది.
సత్వరమే పూర్తిచేయాలి
రైల్వే పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేస్తే మెట్ట ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, తిరుపతి, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు దూరం బాగా తగ్గుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
– మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement