బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు! | Sriransagar Project basin questionable | Sakshi
Sakshi News home page

బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు!

Published Fri, Jul 1 2016 3:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు!

బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు!

బోసిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
18 లక్షల ఎకరాల  ఆయకట్టు ప్రశ్నార్థకం
4.5 టీఎంసీలకు  పడిపోయిన నీటిమట్టం
నేడు మహారాష్ట్రలో  బాబ్లీ గేట్లు ఎత్తివేత

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) నీరు లేక వెల వెల బోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ‘శ్రీరామా కరుణించ వేమిరా’.. అంటూ వేడుకుంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి జూన్ మాసం దాటినా ఇప్పటి వరకు భారీ వరద నీరు వచ్చి చేరలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్  నీటి ఆధారంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీరు లేక పోవడంతో ఆయకట్టు ప్రశ్నాకర్థంగా   మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) అయితే ప్రస్తుత నీటి మట్టం 1046.60( 4.5 టీఎంసీలు) అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది.

డెడ్ స్టోరేజీకి దిగువ భాగాన ప్రాజెక్ట్ నీరు ఉంది. ప్రాజెక్ట్‌లోకి భారీ వరద నీరు వచ్చి చేరితే ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా గత రెండు సంవత్సరాలుగా ఎస్సారెస్పీలోకి వరదలు రాక ఏడాదంతా నీరు లేక బోసి పోయింది. జూన్ మాసం దాటినా ఇంత వరకు చుక్క వరద నీరు వచ్చి చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు తెరనుండగా.. దాంతోనూ ప్రయోజనం కనిపించడం లేదు.

మహారాష్ట్ర నుంచే ప్రధాన వరదలు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రధాన వరద నీరు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచే వచ్చి చేరుతుంది. కాని ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్,  విష్ణుపురి , గైక్వాడ్ ప్రాజెక్ట్‌లు డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్‌లు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కాని ఆ ప్రాజెక్ట్‌లే నీరు లేక వెలవెల బోతున్నాయి. అధిక వరద నీరు వచ్చి చేరే  గోదావరి ప్రాంతం నీరు లేక బోసి పోతోంది. ఇంకా ప్రాజెక్ట్ ఎలా నిండుతుందని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన మహా సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సుప్రీం తీర్పు ప్రకారం జూలై 1న గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి పెద్దగా వరద నీరు వచ్చి చేరే అవకాశం లేదు.  బాబ్లీ ప్రాజెక్ట్ కూడ నీరు లేక వెల వెల బోతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి  సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రాజెక్ట్‌లో  కేవలం 0.006 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్ట్‌లో ఉంది. మళ్లీ  బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్ 28న మూసి వేస్తారు.  బాబ్లీ గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి  ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు అధికారులు.

డెడ్‌స్టోరేజీకి దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు....
ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి దిగువన ఉంది. 1987 తరువాత  ప్రస్తుత సంవత్సరమే ఇంత కనీష్ట స్థాయికి ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయిందని అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నిల్వ ఉంది 4.5 టీఎంసీల నీరు మాత్రమే! ప్రాజెక్ట్‌లోకి వరదలు వచ్చి చేరక పోతే సాగు నీరు అవసరాలు తీర్చడం దేవుడెరుగు.. కనీసం తాగు నీటి అవసరాలు కూడ తీరే పరిస్థితి కనిపించడం లేదు. 

మహారాష్ట్రలో నేడే బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తి వేత..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన ప్రాజెక్ట్‌కు 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను శుక్రవారం ఉదయం ఎత్తనున్నట్లు  ప్రాజెక్ట్ ఎస్‌ఈ సత్యనారియణ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లను ఎత్తాలి. అక్టోబర్ 28న మూసి వేయాలి. దాంట్లో భాగంగానే బాబ్లీ గే ట్లను ఎత్తుతారు. గేట్ల ఎత్తివేత త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. తెలంగాణ తరుపున ప్రాజెక్ట్ ఎస్‌ఈ సత్యనారాయణ, మహారాష్ట్ర తరుపున నాందెడ్ ఈఈ లవరాలే, సీడ బ్ల్యూసీ తరుపున ఈఈ శ్రీనివాస్  పాల్గొంటున్నారన్నారు. బాబ్లీ  ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌లో 0.006 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తినా గోదావరి ప్రవహించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీపై ఆధారపడిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement