కమనీయం..శ్రీవారి కల్యాణోత్సవం
అనంతపురం కల్చరల్ : ధనుర్మాస పూజోత్సవం సందర్భంగా శ్రీనివాస కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. స్థానిక ఆర్‌ఎఫ్‌రోడ్డులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రధాన అర్చకులు ఏఎల్‌ఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా కల్యాణ వేడుకలు జరిపించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మాంగళ్యధారణ జరిగింది.
మధ్యాహ్నం అన్నదానం జరిగింది. రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను నగరవీధులలో ఊరేగించారు. వందల సంఖ్యలో గోవింద మాలధారులు శ్రీవారి నామస్మరణతో ఆనందతాండవం ముందుకు సాగింది. కార్యక్రమంలో గోవింద మాలధారుల సంఘం నేతలు నాగరాజు, సత్యనారాయణ, రమణ పాల్గొన్నారు.