
బాక్సైట్ తవ్వకాలను నిలిపేయండి
♦ లేదంటే నక్సలైట్లు చంపేస్తారు
♦ సీఎస్ ఐవైఆర్‌ను కలిసి విన్నవించిన మంత్రి అయ్యన్న
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే ప్రజాప్రతినిధులను నక్సలైట్లు హతమారుస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి 1,220 హెక్టార్ల భూములను ఏపీఎండీసీకి బదలాయిస్తూ రెండు రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో సచివాలయంలో శనివారం సీఎస్ కృష్ణారావును మంత్రి కలిశారు. జీవో కారణంగా ప్రశాంతంగా ఉండే మన్యంలో చిచ్చుపెట్టినట్లైందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నట్లు తెలిసింది. బాక్సైట్ తవ్వకాలను స్థానిక గిరిజనులతో పాటు నక్సలైట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వివరించినట్లు సమాచారం. దీనిపై సీఎంకు వివరించాలని సూచించగా, మంత్రి హోదాలో తమరే సీఎంను కలవాలని అయ్యన్నకు సీఎస్ సూచించినట్లు తెలిసింది.
గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లం: అయ్యన్న
మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆ ప్రాంత నివాసంలో ఉండే గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించబోదని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన జీవో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటవీ శాఖ అనుమతులకు సంబంధించినది మాత్రమేనన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలంటే అందుకు అనుమతిస్తూ మైనింగ్ శాఖ మరో జీవో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ‘విశాఖ జిల్లా మంత్రిగా ఈ రోజూ నేను చెబుతున్నా. గిరిజనుల అభిప్రాయాలకు భిన్నంగా వెళ్లం. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అందరితో చర్చించి.. వారు అంగీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం, తప్పితే గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లే ప్రసక్తే లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు.
మన్యం బంద్ విజయవంతం
పాడేరు: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో శనివారం అఖిల పక్షాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది.అన్ని వర్గాలవారు బంద్‌కు మద్దతు పలికారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ధర్నాలు, ర్యాలీలతో అఖిలపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బాక్సైట్ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను చేపట్టబోమన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.