ఇటీవల కాలంలో జిల్లాలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కథ ‘100 గంటల్లో 12వేల మరుగుదొడ్ల నిర్మాణం’. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకోవడం.
టైటిల్ : అనంత శివారులో...!
తారాగణం : నాగభూషణం, జబర్దస్త్ సాయి, ఆనంద్, నవీన్
స్పెషల్ అప్పియరెన్స్ : నరసింహ
స్టోరీ లైన్ : ‘వంద గంటల్లో 12 వేల మరుగుదొడ్ల నిర్మాణం’
అనంతపురం టౌన్: ఇటీవల కాలంలో జిల్లాలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కథ ‘100 గంటల్లో 12వేల మరుగుదొడ్ల నిర్మాణం’. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను గంటల వ్యవధిలో పూర్తి చేయాలనుకోవడం..అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను హీరో/ దర్శకుడు నాగభూషణం (డ్వామా పీడీ) అందుకున్నారా? లేదా?.. ఊహించని ట్విస్ట్ లేంటి?..
కథలోకి వెళ్తే...
దేశ వ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్న కథ (వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం)కు దాదాపు ఎలాంటి మార్పు లేకుండానే తెరకెక్కించారు. ముందుగా జూలై 21న జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్వామా ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, ఐబ్ల్యూఎంపీ పీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ‘హీరో’ 306 పంచాయతీల్లో ‘100 గంటల్లో 12 వేల మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ’పై చర్చిస్తారు. అదే నెల 26, 27, 28, 29 తేదీలను టార్గెట్‌గా పెట్టుకుంటారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటివ్ అధికారి రంగన్న, డ్వామా విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్‌రావు, జనరల్ సూపరింటెండెంట్ హబీబాబేగం, ‘మీ కోసం’ సూపరింటెండెంట్ అమృతవాణి, ఎంఅండ్‌డీ (మానిటరింగ్, ఎవాల్యుయేషన్) సూపరింటెండెంట్ ప్రకాశ్‌రావు, ఈ–2 సెక‌్షన్ అధికారి నిర్మల, హార్టికల్చర్ సూపరింటెండెంట్ పద్మావతి, ఎన్టీఆర్ జలసిరి సూపరింటెండెంట్ మంజునాథ్, హెచ్‌ఆర్ సిబారాణి, ప్రహ్లాద, పర్వీశ్, తహసీల్దార్ వేణుగోపాల్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
ఏ రోజుకారోజు నిర్మాణాల ప్రగతిపై సమీక్ష చేస్తారు. తీరా అనుకున్న గడువు ముగిసిపోతుంది. కానీ నిర్మాణాలు మాత్రం నత్తనడకే. వాస్తవానికి జిల్లాకు 36,216 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరై ఉంటాయి. కానీ ‘డ్వామా’ నిర్లక్ష్యంతో అవన్నీ కూడా నిర్మాణాలకు నోచుకోవు. తీరా ‘వంద గంటల’ కథ సిద్ధం చేసే నాటికి ప్రగతిలో ఉన్న 12 వేలను తీసుకుని మిగిలినవన్నీ ‘స్వచ్ఛ భారత్ మిషన్’ కింద ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు ఇచ్చేస్తారు. ఈ 12 వేలను పూర్తి చేసేందుకు పెట్టుకున్న గడువు ముగియడంతో మళ్లీ ఆగస్టు 1వ తేదీన ‘టీం’ సమావేశమవుతుంది. 17 మండలాల పరిధిలో చిన్న పాటి వర్షం కురవడం కలిసొస్తుంది. ఆ వెంటనే రెండ్రోజులు గడువు పొడిగించుకుని శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తారు. ‘హీరో’కు పట్టలేనంత సంతోషం. ఆగస్టు 3వ తేదీన ఉపాధి, వాటర్‌షెడ్ సిబ్బందికి సమాచారం పంపుతారు.
అట్టహాసంగా రిలీజ్ ఫంక్షన్
ఆగస్టు 5వ తేదీన ‘అనంత శివారులో..(టీటీడీసీ)’ (మరుగుదొడ్ల నిర్మాణాల పూర్తి మహోత్సవం) రిలీజ్ ఉంటుందంటారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం, జాబ్‌కార్డుల సీడింగ్‌పై ‘వర్క్‌షాప్’ ఉంటుందని, అందరూ రావాలని పేర్కొంటున్నారు. ఏపీడీ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ఆహ్వానం వెళ్తుంది. తీరా ఆగస్టు 5 వచ్చేస్తుంది. ఉదయాన్నే ఒక్కొక్కరుగా టీటీడీసీకి చేరుకుంటారు. ‘కథ’లో ట్విస్ట్ తెలిసిన వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటారు. సాయంత్రానికి ఓ సమావేశం.. కూలీలకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఆధార్ సీడింగ్‌పై దృష్టి పెట్టాలన్నది దాని సారాంశం. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుంటుంది. కలెక్టర్ వీరపాండియన్ ‘షో’ చూడ్డానికి ముఖ్య అతిథిగా వస్తారని ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంటుంది. కానీ ఆయన రారు.
జబర్దస్త్‌తో కీలక మలుపు :
‘మహోత్సవం’ చప్పగా సాగుతున్న సమయంలో దర్శకుడు/యాంకర్ (డ్వామా పీడీ నాగభూషణం) కథకు ప్రాణంపోస్తారు. ‘ఉపాధి సిబ్బంది వీరుల్లా పని చేశారు.. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేద్దాం’ అంటూ హుషారెత్తిస్తారు. అంతలోనే జబర్దస్త్ నటులు సాయి, ఆనంద్, నవీన్‌ను అందరికీ పరిచయం చేయడంతో ఈలలతో ఒక్కసారిగా ఊపోస్తుంది. 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక స్కిట్లు, డాన్సులతో టీటీడీసీ ఉత్సాహంగా మారిపోతుంది. ‘వ్యక్తిగత మరుగుదొడ్ల’ కథాంశాన్ని వదిలేసి ‘జబర్దస్త్’ తరహా కామెడీతో సాగిపోతుంది. చివరగా నటులు ‘ఎక్ట్సార్డినరీగా పర్ఫార్మెన్స్’ చేశారంటూ డ్వామా తరఫున గిఫ్ట్స్ ఇచ్చి పంపుతారు. గతంలో ఇక్కడికొచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ శాంతకుమారే నటులను ఇక్కడికి పంపారని దర్శకుడు రివీల్ చేస్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన అధికారులను వాళ్ల ఇళ్ల వద్దకు చేర్చే బాధ్యత ‘ట్రాన్స్‌పోర్ట్’ వాళ్లు చూసుకోవాలని, రాత్రి వేళ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించి కథకు శుభం కార్డు వేస్తారు. అయితే డ్వామా సినిమాకు నిర్మాత ఎవరన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.
ప్లస్ పాయింట్స్ :
డ్వామా పీడీ నాగభూషణం యాంకరింగ్, స్క్రీన్ ప్లే.
ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా రిచ్‌గా తీసిన తీరు ఆకట్టుకుంటాయి.
స్పెషల్ అప్పియరెన్స్ : ‘వానవాన వెల్లువాయే పాట’కు జబర్దస్త్ నటుడు సాయితో కలిసి ఉపాధి హామీ ఉద్యోగి ‘నరసింహ’ డ్యాన్స్ వేయడం (ఎక్కువ మరుగుదొడ్లు కట్టించడంతో అవకాశం దక్కించుకుని ఉంటాడు.)
– తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలోని ఓ పాటకు మహిళ డ్యాన్స్ చేయడం.
మైనస్ పాయింట్స్ :
‘వంద గంటల్లో 12 వేల మరుగుదొడ్ల’ కథతో సంబంధం లేకుండా ‘మహోత్సవం’ జరపడం.
– ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులో..కలెక్టరో రాకపోవడం..
– పనితీరు కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసాపత్రాలిస్తామని చెప్పి ఇవ్వకపోవడం.
– మీడియా కూడా పెద్దగా కవరేజీ చేయకపోవడం.
– డ్వామా ఉద్యోగులే విమర్శలు చేయడం.
ఓవరాల్‌గా.. :
‘అనంత శివారులో..’.. డ్వామా ఉద్యోగులను అలరించిన ‘సస్పెన్స్’ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. డ్వామా పీడీ నాగభూషణం అభిమానులను కచ్చితంగా అలరించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే ‘పబ్లిసిటీ’ లేకపోవడంతో ‘అందరూ’ తిలకించలేకపోయారు.
బయట టాక్ ఎలా ఉంది? : ఉపాధి పనులు చేసినా డబ్బులు ఖాతాలో పడక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి కష్టాలను తమవిగా భావించే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించే తీరును బట్టి ‘టాక్’ డిసైడ్ అవుతుంది.