టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఆత్మహత్య
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల టౌన్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణానికి చెందిన తన్నీరు హారిక (19) తల్లి మందలించిందన్న మనస్థాపంతో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజేశం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పద్మశాలీనగర్‌కు చెందిన హారిక డిగ్రీ సెకండియర్ చదువుతోంది. మంగళవారం ఉదయం తన తల్లి తిరుపతమ్మ పూజ చేస్తుండగా, టీవీ ఎక్కువ సౌండ్ వస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. పూజ అనంతరం తల్లి వెళ్లి చూడగా, ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే స్థానికులను పిలిచి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అప్పటికే హారిక మృతి చెందింది. మృతురాలి తండ్రి శేషయ్య ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్వగ్రామం కాగా, మేస్త్రీ పనిచేసుకునేందుకు చాలా ఏళ్ల క్రితం మంచిర్యాలకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, పెద్ద కూతురు శాంతి, కొడుకు చంటి, చిన్నకూతురు హారిక ఉన్నారు. చిన్న విషయాలకే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేదని, ఇప్పుడూ అలాగే వెళ్లిందని అనుకుంటే, ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని తండ్రి తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.