సుందర్‌రాజ్
జూపాడుబంగ్లా: ఎవరెస్టు శిఖరాధిరోహణకు జూపాడుబంగ్లా గురుకుల పాఠశాల విద్యార్థి సుందర్‌రాజ్ ఎంపికయ్యాడు. సి.బెళగల్ మండలం, కొండాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్, సుశీలమ్మ ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన సుందర్‌రాజ్ 10వరకు అరికెర గురుకుల పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ విద్యార్థికి ఎవరెస్టు ఎక్కేందుకు అవకాశం దక్కింది. అందులో భాగంగా లడక్‌లో పదిరోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకుని మంగళవారం కళాశాలకు తిరిగొచ్చాడు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ హేమచంద్ర, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సుందర్‌రాజును ప్రత్యేకంగా అభినందించారు.
ఎవరెస్ట్ ఎక్కేస్తా
శ్రీశైలం ప్రాజెక్టు: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన ముందున్న లక్ష్యమని లడక్‌లో 10 రోజుల ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్న శీలం ఈశ్వరయ్య చెబుతున్నాడు. చెంచు మల్లయ్య, ఈదమ్మల ఆరవ సంతానమైన ఈ విద్యార్తి స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిలువకొండ గ్రామం. 10వ తరగతి వరకు నాగార్జునసాగర్‌లో విద్యను అభ్యసించి ఇంటర్ శ్రీశైలం ప్రాజెక్టులోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు.
ట్రైబల్ వెలే్ఫర్, సోషల్ వెల్పెర్ సొసైటీలు గతంలో 69 మందిని పర్వతారోహణ ట్రైనింగ్‌కు సెలెక్ట్ చేశారు. చేతన కొండ సీబీఆర్ అకాడమిలో జరిగిన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో 34 మంది నిలుదొక్కుకున్నారు. వెస్ట్‌బెంగాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాలో్ల డార్జిలింగ్ బేష్‌లో 34 మంది వారం రోజుల పాటు 70వేల అడుగుల ఎత్తును అధిరోహించి ట్రైబల్ సొసైటీ జెండాను ఎగుర వేశారు. ఆ ట్రైనింగ్‌లో ప్రతిభ కనబర్చిన ఈశ్వరయ్యకు గోల్డ్ మెడల్ దక్కింది. కోచ్ భద్రయ్య నేర్పిన మెలకువలతో గత జనవరి 21వ తేదీ నుంచి నెలాఖరు వరకు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 10 రోజుల పాటు 5 వేల 18 అడుగుల స్టోక్లా శిఖరాన్ని ఎక్కారు. బృందంలో 12 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఈశ్వరయ్య తన అసమాన ప్రతిభను కనబరుస్తూ వస్తున్నాడు.దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఈ విద్యార్థికి త్వరలో పిలుపురానుంది. గతంలో సొసైటీ తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్, పూర్ణలే తనకు స్ఫూర్తి అని ఈశ్వరయ్య ‘సాక్షి’తో చెప్పారు.
ఈశ్వరయ్యకు అభినందనల వెల్లువ
లడక్‌లో 10 రోజుల ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని మంగళవారం సున్నిపెంటకు చేరుకున్న ఈశ్వరయ్యను పలువురు అభినందనలతో ముంచెత్తారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ ఇస్మాయిల్, పీఈడీ శౌరిరాజు, హౌస్‌మాస్టర్ జాన్‌మెషయ్య తదితరులు సత్కరించారు.