కూల్ యాడ్ కుర్రాడు హాట్ | sunny naveen special story about he's first cool drink add | Sakshi
Sakshi News home page

కూల్ యాడ్ కుర్రాడు హాట్

Published Sun, Jul 3 2016 2:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కూల్ యాడ్ కుర్రాడు హాట్ - Sakshi

కూల్ యాడ్ కుర్రాడు హాట్

‘నువ్వు ఎప్పుడైనా తెలుగు సినిమా మొదటి రోజు మొదటి ఆట చూశావా.? ఈలలు, కేకలు.. అసలా రుచే వేరు’ అంటూ చురుగ్గా సంభాషణలు చెబుతూ కూల్‌డ్రింక్‌ను స్టైల్‌గా సిప్ చేసే కుర్రాడిని గమనించారా.? టీవీల్లో, ప్రచార హోర్డింగ్‌ల్లో సందడి చేస్తున్న ఆ మోడల్ మన హైదరాబాద్ కుర్రాడే. పెద్ద పెద్ద స్టార్లకు పెద్దపీట వేసే కూల్‌డ్రింక్ యాడ్‌లో అవకాశం దక్కించుకొని అకస్మాత్తుగా స్టార్‌డమ్ అందుకున్న ఆ కుర్రాడి పేరు సన్నీ నవీన్. ‘స్ప్రైట్’ కూల్‌డ్రింక్ యాడ్‌లో తనకు దక్కిన అవకాశం, భవిష్యత్తు ప్రణాళికల గురించి నవీన్ చెప్పిన సంగతులు అతని మాటల్లోనే..

మాది అనంతపురం. నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్. ఇబ్రహీంపట్నంలోని భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. ఇప్పటి వరకు 15 షార్ట్‌ఫిల్మ్‌లు, కొన్ని మ్యూజిక్ వీడియోల్లో నటించాను. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమా అవకాశాలపై దృష్టి పెట్టాను. 

అవకాశం వచ్చిందిలా..
నా షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చూసిన ‘కోకోనట్ ఫిల్మ్స్’ క్యాస్టింగ్ డెరైక్టర్ ప్రవీణ గారు నన్ను కొన్ని బిట్స్ ఆడిషన్స్‌కు పంపించమంటే పంపాను. మూడు రోజుల తరువాత మీరు సెలక్ట్ అయ్యారని ప్రవీణ గారి నుంచి సమాచారం రాగానే ఆశ్చర్యపోయాను. షూటింగ్ ప్రారంభమయ్యే వరకూ కలో నిజమో అర్థం కాలేదు. ఆ సమయంలో టీవీలో వ్యాపార ప్రకటన  అంటే ఎంత గొప్ప అవకాశమో నాకు బాగా తెలుసు. దర్శకులు సెంథిల్, నిర్మాత సూర్ ఇద్దరూ కూడా షూటింగ్‌కి ముందే నన్ను పిలిచి నా ఆడిషన్‌ను మెచ్చుకున్నారు. వారి మాటలు నాకు ప్రోత్సాహంతో పాటు, ఎంతో బలాన్ని కూడా ఇచ్చాయి. షూటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు.

ఇది తొలి అడుగు..
నిస్సందేహంగా ఈ యాడ్ ఓ అద్భుతమైన ఛాన్స్. అయితే ఇలాంటి అవకాశాలు రోజూ వచ్చి తలుపు తడుతాయని మాత్రం అనుకోను. మరిన్ని మంచి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. మోడల్‌గా, మంచి నటుడిగా గుర్తింపు పొందాలనే నా కలను సాకారం చేసుకోవడానికి ఇది మొదటి మెట్టుగా భావిస్తున్నాను.

ఇష్టమైన నటితో..
షూటింగ్ రోజు వరకు నాతో నటిస్తున్న ఫిమేల్ ఆర్టిస్ట్ ఎవరో నాకు అసలు తెలియదు. బాలీవుడ్ నటి బర్ఖాసింగ్ అని తెలియగానే చెప్పలేని ఆనందం, ఆశ్చర్యం. చిన్నప్పటి నుంచి ఆమె వాణిజ్య ప్రకటనలు చూశాను. నా ఫేవరెట్ నటి ఆమె. బర్ఖాసింగ్‌తో కలసి నటించడం మరిచిపోలేని అనుభవం. ఇక సెట్లో ఉన్న వారంతా నేనెవరో తెలియకపోయినా నాతో సెల్ఫీలు  తీసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement