వక్ఫ్‌బోర్డు బలోపేతానికి సహకరిద్దాం
Published Wed, May 10 2017 11:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం ఇప్పించండి
– దుల్హన్ పథకం కింద జిల్లాకు రూ.5కోట్లు
– రాష్ట్ర్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు
కర్నూలు (అగ్రికల్చర్): వక్ఫ్‌బోర్డు భూములను వివిధ అవసరాలకు తీసుకున్నందున వాటికి రైతులతో సమానంగా పరిహారాన్ని వక్ఫ్‌బోర్డుకు చెల్లించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం వక్ఫ్‌భూముల పరిరక్షణ, మైనార్టీల సంక్షేమం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో çసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్‌భూములు 23వేల ఎకరాలు ఉండగా 5వేల ఎకరాలు అన్యాక్రాంతమైందని, మిగిలిన 18 వేల ఎకరాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో 430 సర్వే నెంబరులో వక్ఫ్‌ల్యాండ్‌ను ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయించిందని ఆ ప్రాంతంలో ఎకరాకు రూ.13 లక్షల ప్రకారం పరిహారం ఇచ్చినందున వక్ఫ్‌భూములకు కూడా ఇదే తరహాలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్‌డీఓకు సూచించారు. మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం వక్ఫ్ ల్యాండ్ తీసుకున్నారని వీటికి పరిహారం ఇప్పించాలని తెలిపారు. కల్లూరులోని సర్వే నెంబరు 532లోని 22.75 ఎకరాల భూమికి వీకర్‌సెక‌్షన్ కాలనీ కోసం, నంద్యాలలోని కుందూ నదిలో సర్వే నెం.914లోని 3.25 ఎకరాలు ప్రభుత్వం ఇతర అవసరాలకు తీసుకుందని వీటికి పరిహారం ఇప్పించాలని సూచించారు. అనంతరం మైనార్టీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దుల్హన్ పథకానికి రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ ఖాదర్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ మస్తాన్ వలి, కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, రామసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement