♦ పోలీసుల హడావుడితో వెనుకంజ వేసిన గాజర్ల అశోక్
♦ టీఆర్‌ఎస్ నేతల కిడ్నాప్ నేపథ్యంలో లొంగుబాటు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మళ్లీ అడవి బాట పట్టారా, అనారోగ్య కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోయేందుకు సిద్ధమైన అశోక్ ఎస్‌ఐబీ పోలీసుల అత్యుత్సాహంతో బెదిరి, తిరిగి వెళ్లిపోయారా? పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నా యి. వరంగల్ జిల్లా వెలిశాలకు చెందిన గాజర్ల అశోక్ సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతల ద్వారా లొంగిపోవాలని నిర్ణయిం చుకున్నారు. ఈ మేరకు సదరు మధ్యవర్తుల ద్వారా పోలీసులకు సమాచారం పంపించారు. లొంగిపోవడానికి ముహూర్తం పెట్టుకుని బయటకు కూడా వచ్చారని సమాచారం. అయితే అశోక్ లొంగుబాటుగా కాకుండా, అరెస్టు చూపిం చాలనుకున్నారో ఏమోగానీ.. తమను కలుస్తామన్న ప్రదేశానికి పోలీసులు నాలుగైదు వాహనాలతో హడావుడిగా వెళ్లారు. ఇదంతా గమనించిన అశోక్ లొంగుబాటుకు ఇది సరైన సమయం కాదని భావించి, మధ్యవ ర్తులకు కూడా చెప్పకుండానే వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. పోలీసులు చేసిన హడావుడిపై ఎస్‌ఐబీ సీనియర్ అధికారులు చీవాట్లు పెట్టారని సమాచారం.
పరిస్థితి బాగోలేదనే..!
భద్రాచలానికి చెందిన ఆరుగురు టీఆర్‌ఎస్ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం, వారి ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉండడంతో... ఈ టెన్షన్ సమయంలో పోలీసుల చెంతకు చేరడం క్షేమం కాదని అశోక్ భావించి ఉంటారని కూడా అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు అధికారికంగా లొంగుబాటును ప్రకటించే దాకా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించాల్సిన చోట హడావుడి చేయడంతో పోలీసుల తీరును శంకించే అశోక్ వెనక్కి తగ్గి ఉంటారని చెబుతున్నారు.
తమను కలుస్తానన్న చోటుకు అశోక్ రాకపోవడం, ఈలోపే అశోక్‌ది అరెస్టా, లొంగుబాటా, పోలీసు అదుపులో ఉన్నాడా అంటూ వివిధ రకాల ప్రచారం జరగడంతో శుక్రవారం కరీంనగర్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రభుత్వం ఎదుట లొంగుబాటు గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా పోలీసుల వద్దగానీ, ప్రజాప్రతినిధులు లేదా రాజకీయ నాయకులు, మీడియా లేదా కోర్టులో గానీ, రెవెన్యూ అధికారుల వద్దగానీ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని అశోక్‌ను కోరుతున్నాం. పోలీసుల తరఫున ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇస్తున్నాం..’ అని ఎస్పీ డి.జోయల్ డేవిస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
లొంగిపోయేందుకు వచ్చి.. వెనక్కెళ్లిన మావోయిస్టు నేత
Published Sat, Nov 21 2015 12:27 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement