ప్రసంగిస్తున్న ప్రభుత్వ కార్యదర్శి సీఎస్. టక్కర్
యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్. టక్కర్ పిలుపునిచ్చారు. సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఎస్వీయూ సెనేట్‌హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీయూకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో జరిగే 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూలో జరగడం విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపధ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వివిధ సైన్స్ సంస్థల నుంచి సుమారు 12వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్‌లో మహిళా సైన్స్ కాంగ్రెస్ , చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో సాంకేతిక ప్రజ్ఞావంతులు, మేథావులు హాజరు అవుతున్నారని తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం, అధికారులు ఏఏ కార్యక్రమాలు చేయాలనేదానిపై స్పష్టత ఉండాలన్నారు.
విశాఖపట్నం దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరంగా అభివద్ధి చెందిందని అక్కడ బ్రిక్స్ సమ్మిట్, ప్లీట్ రివ్యూలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అదేస్థాయిలో తిరుపతిలో కూడా సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేసి ఎస్వీ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ జయలక్ష్మీ, ఎస్వీయూ వీసీ దామోదరం పాల్గొన్నారు.