‘‘నేనో సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాను తీసేంత స్వేచ్ఛ నాకు కావాలి. ఇదే నా డ్రీమ్. తమిళంలో నేను చేయగలుగుతున్నాను. కానీ తెలుగులో నాకు అంతగా సపోర్ట్ లభించలేదు. అయినా తెలుగు ఆడియన్స్‌కు, నాకు ఫుల్‌స్టాప్ కాదు కదా.. చిన్న కామా కూడా పడలేదు.. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్యలో ఉన్నది చిన్న టైమ్ గ్యాప్ మాత్రమే. ఇప్పుడు ‘టక్కర్’తో టైమ్ కలిసొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు.
► ధనవంతుణ్ణి కావాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు ఓ కుర్రాడు. అయితే అన్నీ అతని ఊహలకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఏం చేస్తాడు? ఎవరితో అతను ఘర్షణ పడాల్సి వస్తుంది? అన్నదే ‘టక్కర్’ కథాంశం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హీరో, హీరోయిన్ రిలేషన్‌షిప్‌లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు, అహం, లింగబేధం, వయసు.. ఇలాంటి అంశాలు కథలో చర్చకు వస్తాయి. కార్తీక్ క్రిష్ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు.
► లవ్‌స్టోరీస్ సినిమాల గురించి చర్చకు వస్తే.. వాటిలో ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నాకు లవ్‌స్టోరీ చెబితే, దాదాపు నో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లవ్‌స్టోరీ సినిమా చేసి, అది హిట్ అయితే నాకు మళ్లీ ఓ పదేళ్ల పాటు లవ్‌స్టోరీలే వస్తాయి. నేను లవ్‌స్టోరీస్ మాత్రమే చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. యాక్టర్‌గా డిఫరెంట్ సినిమాలు చేయాలి.
► రచయితగా ‘గృహం’ ఫ్రాంచైజీకి కథలు రెడీ చేస్తున్నాను. మా ప్రొడక్షన్ హౌస్‌లో కొత్తవారితో సినిమాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. ‘బొమ్మరిల్లు 2’ ఆలోచన ఉంది. కానీ అది పెద్ద చాలెంజ్‌తో కూడుకున్న పని.. చూడాలి.
► యాక్టర్‌గా నేను మంచి ఫామ్‌లోకి వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది. మళ్లీ తెలుగులో నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో కీలక పాత్ర, ‘ది టెస్ట్’లో ఓ లీడ్ రోల్, ‘చిన్నా’ సినిమా చేస్తున్నాను. ఓ స్ట్రయిట్ లవ్‌స్టోరీ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. కార్తీక్ క్రిష్‌తో మరో సినిమా చేయనున్నాను.
► మీకు ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలేదంటారా? అని ఓ విలేకరి అడగ్గా... ‘మ్యారేజ్ చేసుకునే ఏజ్ నాకు వచ్చినప్పుడు.. ఆ పెళ్లి భోజనం తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పెళ్లి భోజనం నాకు గొంతు దిగడం లేదు. సో.. దానికి ఓ టైమ్ ఉంది. డైరెక్షన్ నా డ్రీమ్. నా మ్యారేజ్ నా పేరెంట్స్ డ్రీమ్. నా పెళ్లి, రిలేషన్‌షిప్స్ గురించి వార్తలు వచ్చాయంటే అవి రాసిన వారిని అడగాలి’’ అని అన్నారు సిద్ధార్థ్.
Comments
Please login to add a commentAdd a comment