
చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో
- పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేపిన యువ దంపతుల ఆత్మహత్య
కలిసి బతకలేమనుకున్నారో, చనిపోయి కలిసుందామనుకున్నారో.. పుణ్యక్షేత్రానికి వచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసున్నారు. చనిపోయే ముందు సెల్ఫీలు దిగి, 'మేం చనిపోతున్నాం..' అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తిరుమలలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సంపత్ కుమార్, సత్యవాణి దంపతులు తిరుమలకు వచ్చి రాంభగీచా అతిథి గృహంలో 384వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం గదిని శుభ్రం చేసేందుకు సిబ్బంది వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. సంపత్ కుమార్ దంపతులు శవాలుగా కనిపించారు.
ఒకే ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ తమిళనాడు దంపతులు చనిపోవడానికి ముందు సెల్ఫీలు దిగారు. 'మేం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం' అని చెబుతూ సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు.. గదిలో దొరికిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, బంధువులకు సమాచారం అందించారు. తిరుమలలో ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఆత్మహత్యా ఘటన ఇదే కావడం గమనార్హం.