
సామాజిక తెలంగాణ కోసమే పాదయాత్ర
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
తాండూర్/రెబ్బెన: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలాల్లో సాగింది. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం గిరిజనులు ఉండగా సమస్యలు సైతం అదే స్థాయిలో ఉన్నాయ న్నారు.
కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే అపోహ యువకుల్లో ఉందని కాని ఎర్ర జెండా అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ఎర్రజెండా అని చరిత్ర చెపుతోం దన్నారు. ఇప్పటికీ 65 రోజుల పాటు 1700 కి.మీ. పాదయాత్ర సాగిందన్నారు. మరోవైపు సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో తమ్మినేని కోరారు. కంపెనీని బ్యాంకులు వేలం వేయనున్నాయనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వమే దానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.