టార్గెట్ ఎస్పీ
సాక్షి ప్రతినిధి, ఏలూరుః
అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని టార్గెట్ చేశారు. ఏలూరులో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కాకపోవడానికి నెపం పోలీసులపై నెట్టివేయడానికి సన్నద్ధం అయ్యారు. దీనిలో భాగంగా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై ద్వజమెత్తారు. అతనిని మార్చేయాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. మంగళవారం జరిగిన సమన్వయ కమిటీ దీనికి వేదికగా మారింది. జిల్లా ఇంఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి పీతల సుజాత, జిల్లా అద్యక్షురాలు సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎక్కువ సేపు పోలీసులపైనే చర్చ జరిగింది. జిల్లాలో పోలీసులు మా మాట వినకపోతే ఒక మేమెందుకు.. ప్రజా ప్రతినిధులు అన్న పదానికే అర్థం లేదని పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. జిల్లా ఎస్‌పీతో పాటు డీఎస్పీలు, సీఐలు కూడా తమ మాటను లెక్క చేయడం లేదని, ఇటువంటి పరిస్థితిలో తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆయన దష్టికి తీసుకువెళ్ళారు. చిన్నచిన్న కేసులకు సంబంధించికి కూడా తమ సిఫార్సులను తోసిపుచ్చుతుంటే ప్రజలు, అబిమానులు, కార్యకర్తల ఎదుట తల ఎత్తుకోలేకపోతున్నామని వాపోయారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన తగాదాల్లో ఎస్‌సీ,ఎస్‌టీ కేసు నమోదు విషయంలో అక్కడి డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్సించారని, దానిపై తాము రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో కూడా పోలీసుల వైఖరి వల్లే విద్యార్ధులు సభాప్రాంగణంలోకి రాలేదని వారు ఆరోపించారు. చింతలపూడి, ఆచంట, పోలవరం ఏఎంసీతో పాటు ఇతర పదవులు విషయంపై చర్చ జరిగింది. ఇప్పటికే ఈ జాబితాను అధిష్టానం వద్దకు పంపించామని అక్కడ ఆమోదం పొందాల్సి ఉందని ఇంఛార్జి మంత్రి తెలిపారు. పోలవరంలో పదవుల పంపకంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చింతలపూడి ఏఎంసీ విషయంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, రాష్ట్ర మంత్రి పీతల సుజాతలతో చర్చించి ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత తీసుకురావాలని పలువురు కోరారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా జంగారెడ్డిగూడెంకు చెందిన ముస్తఫా పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమన్ని జిల్లా వ్యాప్తంగా విస్తతంగా అమలు చేయాలని, గ్రామీణ రహదారుల అభివద్ధిపై దష్టి సారించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇళ్ళ నిర్మాణం విషయంలో వెనుకడుగులో ఉన్నామని, ఎంత త్వరగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తే అంత మంచిదని, అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ త్వరగా రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.