ఇష్టారాజ్యంగా పన్నుల పెంపు
ఇష్టారాజ్యంగా పన్నుల పెంపు
Published Sat, Feb 11 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
ప్రభుత్వం తీరుపూ మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నేత కందుల దుర్గేష్ ఆగ్రహం
కడియం : శాస్త్రీయమైన హేతుబద్దత లేకుండా పంచాయతీల్లో పన్నులు పెంచుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ అన్నారు. శనివారం ఆయన కడియంలో స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేఽశారు. మూడు నాలుగు రెట్లు ఒకేసారి పన్నులు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2000 సంవత్సరానికి ముందు టాక్స్ రివిజన్ విధానం ఉండేదన్నారు. ఆ తర్వాత ఏటా 5 శాతం టాక్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. వీటిని కాదని కేవలం పంచాయతీరాజ్ కమిషనర్ డీవో లెటర్ ద్వారా కలెక్టర్ల విచక్షణ మేరకు పంచాయతీల్లో పన్నులు పెంచేస్తున్నారన్నారు. బ్రిటష్ పాలనను గుర్తుకు తెచ్చే ఈ విధానం ఎంత వరకు సబబని దుర్గేష్ ప్రశ్నించారు. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. సాచురేషన్ విధానంలో భాగంగా ఆ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. చేనేత కుటుంబాల్లో 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పురుషులకు 50 ఏళ్లు, మహిళలకు 55 ఏళ్లు ఉండాలని జీవో తీసుకువచ్చారు. ఇది మహిళల పై చూపుతున్న వివక్ష కాదా? అని దుర్గేష్ ప్రశ్నించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెట్టి మహిళలు, పురుషులు సమానమని చెబుతున్న చంద్రబాబు చేనేత కార్మికుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నూటికి 90 మంది ఉన్న నర్సరీ రైతులపై విద్యుత్ చార్జీలు, ట్యాక్స్‌ల భారం మోపితే చిన్న రైతుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. రూ.ఐదు కోట్లతో నర్సరీ రైతులకు ఉపయోగపడే కన్వెన్షన్ సెంటర్‌ను అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి మంజూరు చేశారన్నారు. దానిని తక్షణం పూర్తి చేసే చర్యలు చేపట్టాలని కోరారు. డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, మాజీ సర్పంచ్‌లు గట్ట నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉప సర్పంచ్ చిక్కాల బాబులు, స్థానిక నాయకులు ముద్రగడ జెమి, పల్లి చిన్న, తూపాటి చిన్న, పాటంశెట్టి సునీల్‌కుమార్, బొబ్బిలి ప్రసాద్, గాద పెద్దబ్బులు, రత్నం విజ్జయ్య, గాద రామన్న, అంబటి రాజరత్నం పాల్గొన్నారు.
Advertisement
Advertisement