
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నగరవాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. అసలే నీటికొరతతో ఇబ్బందులు పడే నగర ప్రజలను కొత్త సంవత్సరంలో మరింత ఆందోళనలో పడేసింది. నీటి వినియోగంపై పన్నులు పెంపు నిర్ణయానికి జల్‌బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు నీటి వినియోగంపై భారీగా పన్నును విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
తాజా ఆదేశాల ప్రకారం ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల వినియోగ పరిమితి మించితే ఇక బాదుడు తప్పదు. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్న 20వేల లీటర్ల పరిమితి దాటితే 20శాతం పన్ను చెల్లించక తప్పదు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, నెలకు 20,000 లీటర్ల వినియోగం టారిఫ్‌లో ఎటువంటి మార్పు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిమితికి మించి ఒక్క లీటర్ వినియోగం పెరిగినా మొత్తం వాడకంపై పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది.