ఆత్మకూర్‌లో పన్నుల డబ్బు మాయం!
రూ.లక్ష వరకు గల్లంతు
కారోబార్‌ను విధుల నుంచి తొలగింపు
మెట్‌పల్లిరూరల్ : మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పం చాయతీ వసూలు చేసిన వివిధ పన్ను ల డబ్బులు సుమా రు రూ.లక్ష వరకు మాయమయ్యా యి. ఈ విషయం మంగళవారం సర్పంచ్, మండల ఉపాధక్షుడు, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఆరా తీయగా.. స్వాహా అయినట్లు వెలుగుచూసింది. గ్రామపంచాయతీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు.. పన్నుల డబ్బు స్వాహా విషయమై ఫోన్‌లో చర్చించుకున్న మాటలు బహిర్గతమయ్యాయి. ఇంటిపన్ను.. నల్లా డిపాజిట్లు, నల్లా పన్నులను వసూలు చేసిన కారోబార్.. నకిలీబిల్లుబుక్‌లనుంచి ప్రజలకు రశీదులు ఇచ్చినట్లు బయటపడింది. నకిలీబుక్‌ల ద్వారా ఎంతమంది నుంచి ఎంతమొత్తం వసూలు చేశారో నిర్ధరించేందుకు కమిటీ వేశారు.
కారోబర్ శ్రీనివాస్‌ను విధుల నుంచి తప్పించారు. 2011 నుంచి అన్ని రశీదులను తనిఖీ చేయాలని, గతంలో ఇక్కడ పని చేసి ఉద్యోగ విరమణ పొందిన కార్యదర్శి రాజేశ్వర్‌ను కూడా ప్రశ్నించాలని తీర్మానించారు. గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కార్యకర్త వద్ద స్థానిక నాయకులతో సన్నిహితంగా మెలిగే ఒకరు రూ.మూడువేలు, 30 గుడ్లను తీసుకున్నట్లు గుర్తించారు. సమావేశంలో సర్పంచ్ గంగుల బలరాంమూర్తి , వైస్ ఎంపీపీ రాచమల్ల సురేశ్, ఉపసర్పంచ్ దిలీప్, కార్యదర్శి రమేశ్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.