జనంలోకి ఎలా?
నోట్ల కష్టాలపై టీడీపీలో గుబులు
జనం నుంచి వ్యతిరేకత వస్తుందని అధికార నేతల భావన
జన్మభూమిలో సెగ తప్పదని కలవరం
టీడీపీకి ‘నోట్ల’గుబులు పట్టుకుంది. తన సలహాతోనే ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్నార’ని మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే ప్రకటించుకోవడం ఇప్పుడా పార్టీ వర్గాలను ఇరకాటంలోకి నెట్టింది. నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు పార్టీపై ప్రభావాన్ని చూపుతాయని జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్నాళ్లు ఈ కష్టాలుంటాయని ఆర్థిక రంగ నిపుణులంటుండటంతో మరింత కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2నుంచి జన్మభూమిలో జనానికి ఏ సమాధానం చెప్పాలని వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు.
సాక్షి: నోట్ల రద్దు నిర్ణయం సత్ఫలితాలనిస్తుందని భావించిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు నీరుగారిపోతున్నారు. వారిలో నమ్మకం సడలిపోతోంది. పైగా జనం రోజూ ఏటీఎంలు..బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. వీరిలో ఎవరిని కదిపినా ఈ నిర్ణయంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. దీంతో ఇది కాస్తా తమకు శాపంగా మారుతుందని అధికార పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొందని జిల్లాలో టీడీపీ అత్యున్నత వర్గాలు నిర్వహించిన ఓ సర్వేలో తేలిందని విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ పార్టీ అధిష్టానం రద్దుపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లు దిగాలు పడుతున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని..రద్దు నిర్ణయాన్ని సమర్థించిన తరువాత ఇంకా దిగజారిందని ఆ పార్టీ నాయకులు ప్రైవేటు సంభాషణల్లో అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని టీడీపీ నుంచి టికెట్ ఆశించే ఓ ప్రొఫెసర్ జిల్లా పరిస్థితిపై నివేదిక పంపినట్లు సమాచారం. రైతులు, రైతు కూలీలు, చిన్న కార్మికులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తన నివేదికలో పొందుపరిచారు.
చాలామంది వృద్ధులు, వికలాంగులు, రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్లను ఇప్పటివరకు డ్రా చేసుకోలేదని వారిలో రద్దు నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2నుంచి జన్మభూమి నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో జనంలోకి వెళ్లి ఏమని చెప్పాలి.. ఎలా ముఖం చూపాలని కిందిస్థాయిలో నేతలంతా కలవరపడుతున్నారు. నోట్ల కష్టాలపై జనం కచ్చితంగా నిలదీస్తారని వీరంతా భయపడుతున్నట్లు తెలిసింది. తిరుపతి, చిత్తూరు రైతుబజార్లలో స్వైపింగ్ మిషన్లను నిర్భందంగా అమలు చేయాలని ప్రభుత్వం భావించడంతో రైతులు ఎదురుతిరిగారని కొందరు అధికార పార్టీ నాయకులంటున్నారు. మోదీ నిర్ణయాన్ని తన నిర్ణయంగా చంద్రబాబు ప్రకటించుకోవడంతో ఓ టీడీపీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషను ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇలాంటి వేదికల్లో పట్టణ ఓటర్లు స్పందిస్తే తమ గతేమిటి అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు భోగట్టా.