హామీల అమలులో టీడీపీ విఫలం
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నేతల ధ్వజం
గుంటూరు (పట్నంబజారు): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచలేని టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ యువజన, సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు వనమా బాలవజ్రబాబు, కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, మొగిలి మధు, కోవూరి సునీల్‌కుమార్, షఫాయితుల్లా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నేతలు సత్యాలు మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసత్యవాదులు ఎవరో ప్రజలకు బాగానే తెలుసన్నారు. అసత్యం, అబద్ధం, అవినీతి టీడీపీ మరో పేర్లని ఎద్దేవా చేశారు. 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని విమర్శించటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.