ఆ ఖర్చును టీడీపీ నుంచి వసూలు చేయాలి
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: నాలుగో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును తెలుగుదేశం పార్టీ నుంచి సర్కారు ఖజానాకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు గురువారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే జన్మభూమిని పార్టీలకు అతీతంగా ప్రజలందరి భాగస్వామ్యంతో చేయాల్సి ఉండగా దీన్ని టీడీపీ పూర్తి ప్రచార కార్యక్రమంగా నిర్వహించిందని విమర్శించారు. దీంతో దుర్వినియోగమైన ప్రజాధనాన్ని టీడీపీ నుండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. జన్మభూమి వంటి ప్రభుత్వ కార్యక్రమంలో విపక్ష పార్టీలపై సీఎం చంద్రబాబు ఎలా అనవసర విమర్శలకు దిగుతారని ప్రశ్నించారు.
రాహుల్‌తో కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం పీసీసీ చీఫ్ రఘువీరా మీడియాతో మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేసిన పోరాటాలకు సంబంధించిన నివేదికను రాహుల్‌కు సమర్పించినట్లు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తోనూ పార్టీ నేతలు సమావేశమయ్యారు.