టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు
- మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అధికారపార్టీ శ్రేణులు
- ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమన్న ఎమ్మెల్సీ వెన్నపూస
అనంతపురం : ‘పదేళ్లుగా టీడీపీలో పని చేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలను విస్మరించారు. గుర్తింపు లేకుండా చేస్తున్నారు’ అని టీడీపీకి చెందిన పలువురు ఎస్సీలు వాపోయారు. వారంతా అనంతపురం 20వ డివిజన్‌కు చెందిన మల్లెలమీద నరసింహులు సమక్షంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక మిస్సమ్మ కాంపౌండ్‌లో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు.}
- ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందన్నారు. 600 అపద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు కూడా రోజుకో అపద్దం చెబుతోందన్నారు. అన్ని వర్గాలనూ మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
- మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు అధికార పార్టీలో చేరతారని, కానీ అధికారపార్టీ వాళ్లు ప్రతిపక్షంలో చేరుతున్నారంటే ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలనను అంతమొందించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందన్నారు.
- మల్లెలమీద నరసింహులు మాట్లాడుతూ పదేళ్లుగా టీడీపీలో పని చేసినా ఎలాంటి గుర్తింపూ లేదన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. కార్యకర్తలకు కనీస గౌరవం లేదని, ముఖ్యంగా ఎస్సీలకు తీరని అన్యాయం చేçస్తున్నారని ఆవేదన చెందారు. ఎస్సీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టిస్తుంటే అడిగేవారే లేరని వాపోయారు. ఇవన్నీ జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.
- వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు. అధికార పార్టీలో అన్యాయానికి గురైన వారు చాలామంది వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని, తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోగీశ్వర్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు షానూర్, రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, అధికార ప్రతినిధులు మిద్దె కుళ్లాయప్ప, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున, బాలాంజనేయులు, పోతులయ్య, మాజీ కౌన్సిలర్ బలరామిరెడ్డి, 20వ డివిజన్ కన్వీనర్ బలరాం, విద్యార్థి విభాగం పరుశురాం, యువజన విభాగం మారుతీనాయుడు, ఎస్సీ సెల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.