నంద్యాల: ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. బనగానపల్లె కేంద్రంగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మంత్రులు అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బసచేశారు. ఇతర జిల్లాల నేతలు కర్నూలు విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించినా లెక్కచేయడం లేదు.
మరికొంత టీడీపీ నాయకులు ఆళ్లగడ్డలో తిష్టవేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కర్నూలు జిల్లాలో మంత్రులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి వాహనం(ఏపీ 21 బీఎల్ 9999)లో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పలు లాడ్జిల్లో మకాం వేసి నంద్యాలలో మంత్రాంగం నడుపుతున్నారు. నంబర్ ప్లేట్ లేని ఫార్చ్యునర్ కారులో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆళ్లగడ్డలో హల్‌చల్ చేయడం మీడియా కంటపడింది. ఎన్నికల కోడ్ ప్రకారం కర్నూలు జిల్లాను వదిలివెళ్లాల్సివున్నా మంత్రి పట్టించుకోకపోవడం గమనార్హం.
అయ్యలూరి సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. వార్డుల వారీగా నేతలకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండటంతో రెస్టారెంట్ ఎదుట టీడీపీ నేతలు క్యూ కట్టారు. టీడీపీ నేతలున్న రెస్టారెంట్ వైపు పోలీసులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.