
మండే సూరీడు
జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
తిరుపతిలో సోమవారం 43.5
ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజానీకం
తిరుపతి తుడా: జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇళ్లల్లోంచి బయటకు రావడానికి మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయపడుతున్నారు. భానుడి భగభగలకు రహదారులు వేడెక్కి పోయాయి. రోడ్డు కక్కుతున్న సెగలకు వాహన చోదకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. సోమవారం రోజున తిరుపతిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈశాన్య వేడి గాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత నెల చివరి వారం తోపాటు ఈ నెల మొదటి వారంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
ద్రోణి కారణంగా జిల్లాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ద్రోణి రాష్ట్రాన్ని దాటడంతో మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ తీవ్రతకు వేడిగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. తీవ్ర ఉక్కపోత కారణంగా సాయంత్రం వేళల్లో ఇళ్లలో ఉండలేక ఆరు బయటే సేదదీరుతున్నారు. ఇక రాత్రి వేళల్లో ఫ్యాన్లు, కూలర్లు పని చేస్తున్నా జనం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. ఎండ కారణంగా చిరు వ్యాపారులు, కూలీలు, పాదచారులు, కాపరులు, వాహనచోదకులు విలవిలలాడిపోయారు. ఎండలు మండుతుండడంతో ప్రధాన వ్యాపార సముదాయాల రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గొర్రెల కాపరులు ఇంటికే పరిమితమయ్యారు.