నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం | tension at nagarjuna university | Sakshi
Sakshi News home page

నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం

Published Fri, Jul 24 2015 1:55 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం - Sakshi

నాగార్జున వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం

పరస్పర ఆరోపణలకు దిగిన విద్యార్థులు
♦  రెండు వర్గాల మధ్య ఘర్షణ
♦  సర్దిచెప్పిన పోలీసులు, కమిటీ సభ్యులు
♦  పోలీసుల మోహరింపు
♦  ప్రిన్సిపల్ సస్పెన్షన్
♦  పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

సాక్షి, ఏఎన్‌యూ, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కళాశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ గురువారం వర్సిటీలో నిర్వహించిన బహిరంగ విచారణ ఉద్రిక్తతకు దారితీసింది.

కమిటీ ముందు విద్యార్థి సంఘాలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులు బాహాబాహీకి దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చే తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింపజేశారు. వర్సిటీకి చెందిన పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, బీసీఎస్‌ఎఫ్, ఎంఎస్‌ఎఫ్  తదితర విద్యార్థి సంఘాలు తమ వాదనలు వినిపించాయి. కమిటీ సభ్యులు ఘటన కు సంబంధించిన సూచనలు, సలహాలు, ఆధారాలు ఇవ్వాలని కోరారు.

దీనికి స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఫ్రెషర్స్ పార్టీ పేరుతో హాయ్ లాండ్‌లోను, ఇతర సందర్భాల్లోనూ విద్యార్థులతో కలిసి నృత్యం చేశారని, ఆ దృశ్యాలతో కూడిన డీ వీడీ తమ వద్ద ఉందని దానికి కమిటీకి సమర్పిస్తామని దానికి ముందు బహిరంగంగా ఆ దృశ్యాలను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన కమిటీ డీవీడీని ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు.

ఈలోగా ఓ అధ్యాపకుడు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్‌పై ఆరోపణలు చేశారు. దీనికి వ్యతిరేకంగా అదే కళాశాలకు చెందిన కొందరు సీనియర్ విద్యార్థులు ఆరోపణలకు దిగారు. దీంతో విద్యార్థి సంఘాలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులకు మధ్య పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో కమిటీ హాలులో గాజు పరికరాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణ పడుతున్న విద్యార్థులను కమిటీ సభ్యులు, పోలీసులు సర్దిచెప్పి కమిటీ హాలు నుంచి బయటకు పంపారు.
 
ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.బాబూరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఇన్‌చార్జి వీసీ కేఆర్‌ఎస్ సాంబశివరావు తెలిపారు. అప్పటికే ప్రిన్సిపల్ రాజీనామా సమర్పించారని, బుధవారం కళాశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో తనపై వచ్చిన అభియోగాలకు కలత చెంది, నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఈనెల 22వ తేదీతో ఆయన లేఖ సమర్పించారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయనకు సస్పెన్షన్ ఉత్తర్వులూ జారీ చేశామని తెలిపారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి డాన్సులు చేసిన సీడీలను విడుదల చేసిన నేపథ్యం వల్లనే రాజీనామా చేశారని కొందరు విద్యార్థులు ఆరోపించారు.
 
విద్యార్థినిది ఆత్మహత్యా ? హత్యా?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు రిషితేశ్వరిది హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డది హత్యేననే అనుమానాలు వ్యక్తం చేస్తుం డడంతో పాటు పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు బుధవారం గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
 
సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో పోలీసులు హత్యా కోణంలోనూ విచారణ ప్రారంభించారు. లేడీస్ హాస్టల్ వద్ద ఉన్న సెల్‌టవర్ సిగ్నల్‌ను పరిశీలించి రిషితేశ్వరి వృుతి చెందిన సమయంలో అక్కడ మరో ఫోన్ ఏమైనా వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 
శృతిమించిన ర్యాగింగ్ తట్టుకోలేకే..
రిషితేశ్వరి మృతికి ముందురోజు ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కలిసి మంగళగిరిలోని ఓ థియేటర్‌లో ఫస్ట్‌షో సినిమాకు వెళ్లింది.  అక్కడ ఓ సీనియర్ విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక సినిమా నుంచి మధ్యలోనే హాస్టల్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత హాస్టల్‌లో రిషితేశ్వరిని ఓ సీనియర్ అర్థనగ్నంగా తిప్పిందని, సీనియర్ అబ్బాయిల మాట విననందుకు ఇది పనిష్మెంట్ గా అలా చేశారని రిషితేశ్వరి చెప్పిందని పలువురు విద్యార్థులు చెప్పుకుంటున్నారు.

అర్ధనగ్న దృశ్యాలను వీడియో తీసిన ఆ సీనియర్ విద్యార్థిని తాను రిషితేశ్వరికి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా నమ్మించేందుకు 14వ తేదీ ఉదయాన్నే సీనియర్ అబ్బాయిలకు ఆ దృశ్యాలను చూపినట్లు సమాచారం. వాటిని అబ్బాయిలు కొందరు తమ సెల్‌ఫోన్‌లలోకి అప్‌లోడ్ చేసుకుని చూస్తున్న విషయం తెలుసుకున్న రిషితేశ్వరి అవమానాన్ని తట్టుకోలేక కాలేజీ నుంచి మధ్యలోనే వచ్చేసి హాస్టల్‌లోని తన గదికి వెళ్లి డైరీలో లాస్ట్‌నోట్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఓ పార్టీలో కొందరు విద్యార్థులు ఈ విషయాలను బయటపెట్టడంతో సమాచారం బయటకు పొక్కింది. రిషితేశ్వరి మృతితో సదరు సీనియర్ విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌లలోని వీడియోలను డిలీట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికే ఈ దిశగా విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement