‘సోమశిల’ పరిహారం తేల్చాల్సిందే!
► భూముల ‘సాగు’కు అటవీ అధికారుల అడ్డంకి
► ఇంటికో ఉద్యోగమేది..కలగానే పునరావాసం
► సోమశిల ముంపువాసులకు వర్తించని ఆర్‌ఆర్ ప్యాకేజీ
► 28 న ముంపుబాధితులతో వైఎస్సార్‌సీపీ కలెక్టరేట్ వరకు ర్యాలీ
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కోసం జిల్లాలోని వేలాదిమంది రైతులు తమ భూములను.. ఇళ్లను కోల్పోయారు. ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఎటో తరలిపోయారు. వారి త్యాగాన్ని గుర్తించి సరైన పరిహారం ఇవ్వాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో వారు దుర్భర పరిస్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నెల్లూరు, తమిళనాడుకు నీళ్లిచ్చేందుకు జిల్లావాసులు త్యాగం చేసినప్పటికి.. వారిపట్ల నేటి పాలకులు నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారు. దీనిపై ముంపుబాధితులు ఆగ్రహం.. అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
రాజంపేట: జలాశయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ జలాశయంలో నీళ్లు నింపాలంటే మన జిల్లాలోని ఊర్లకు ఊర్లు..భూములకు భూములను కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది ఇప్పటి మాట కాదు...40 యేళ్ల కిందటి నుంచి కొనసాగుతూనే ఉంది. అదే సోమశిల జలాశయం. 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయంలో 71 టీఎంసీ రెండుసార్లు మాత్రమే నింపగలిగారు. ఈ సోమశిల జలాశయం వెనుక ప్రాంతంలో 105 గ్రామాలు బ్యాక్‌వాటర్‌లో మునకకు గురయ్యాయి. దాదాపు 20 వేల కుటుంబాలు అరకొర పరిహారంతో ఊర్లు ఖాళీ చేయాల్సి వ చ్చింది. దాదాపు లక్ష ఎకరాల భూమి మునకలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి సరైన జీవనాధారం లేక ముంపుబాధితులు విలవిలలాడుతున్నారు.
పెండింగ్‌లో పరిహారం
సోమశిల వెనుకజలాల్లో మునకకు గురయ్యే నందలూరు, ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాలు ఉన్నాయి. 1977 నుంచి ఈ మండలాల్లోని ముంపుగ్రామాల్లోని కట్టడాలకు, భూములకు పరిహారం చెల్లింపు ప్రకియ మొదలైంది. ఇప్పటివరకు ఇంకా కొంతమేర భూములకు, ఇళ్లకు పరిహారం చెల్లింపు అసంపూర్తిగానే ఉంది. చివరి బాధితులు తమ పరిహారం కోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కనుక పెండింగ్‌లో ఉన్న భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తే రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని ముంపుబాధితులు, నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం చాలా గ్రామాల్లో అధికారులు పాక్షికంగా పరిహారం పంపిణీ చేసి చేతులుదులుపుకోవడమే. ఇదే విషయాన్ని రైతుసంఘ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు.
భూముల సాగుకు అడ్డంకిగా అటవీశాఖ..
సోమశిల మునక ప్రాంతాన్ని 1997 సెప్టెంబరులో పెనుశిల అభయారణ్యంలోకి చేర్చారు. అటవీ చట్టం ప్రకారం అక్కడ అనుమతి లేనిదే ఎవరు ప్రవేశించరాదనే నిబంధన అమలుచేశారు. ఈ అమలు ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. సోమశిల ముంపునకు సంబంధించి ఒంటిమిట్ట మండలంలోని పెన్నపేరూరు భూములకు పరిహారం కొంతమేర మాత్రమే చెల్లించారు. అయితే ఈ భూ ములు అక్కడి రైతులు సాగుచేసుకుంటుంటే అట వీశాఖ అడ్డుతగిలింది. దీన్ని రైతులు వ్యతిరేకించా రు. తమ ఇళ్లకు కూడా పరిహారం, భూములకు పూర్తిగా పరిహారం ఇవ్వాలని తేగేసి చెబుతున్నా రు.ఇది పెనువివాదంగా మారుతోంది. ఈ పరిస్థితి ఒక్క పెన్నపేరూరే కాదు.. ముంపుగ్రామాల పరిధి లో భూములు సాగుచేసుకుంటున్న వారిందరిది.
వైఎస్సార్ హయాంలో ...
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముంపుబాధితులను కోట్లాది రూపాయలను పరిహారం కింద ఇచ్చి సాధ్యమైనంత వరకు ఆదుకోగలిగారు. ముంపువాసుల సమస్యలను పరిష్కరించేందుకు అనేక విధాలుగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముంపుబాధితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పునరావసం కల్పించాలని అనేక విధాలు ముంపుబాధితులకు తన ప్రభుత్వం ద్వారా సాయపడ్డారు.
ముంపుబాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ ర్యాలీ
సోమశిల ముంపుబాధితుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఈనెల 28న ర్యాలీ చేపడుతోంది. కడప కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, నాయకులు, ముంపువాసులు ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఆర్‌ఆర్ ప్యాకేజీ లేకపోవడం దారుణం
అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే సోమశిల ప్రాజెక్టుకు ఆర్‌ఆర్ ప్యాకేజీ లేకపోవడం దారుణం. ముంపుబాధితుల పరిహారంకు సంబంధించి బోనస్ లేదు. ఇంటికో ఉద్యోగం కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారు. వైఎస్సార్ హయాంలో ముంపువాసులకు న్యాయం జరిగింది. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో భూములకు, ఇళ్లకు పరిహారం పెండింగ్‌లోనే ఉంది. –ఎల్లారెడ్డి, న్యాయవాది, ముంపువాసుల ప్రతినిధి
డీకేటీ భూములకు పరిహారం ఇవ్వలేదు
ముంపుగ్రామాలకు సమీపంలో ఉన్న డీకేటీ భూములను ఎన్నో ఏళ్లుగా బాధితులు చేసుకుంటున్నారు. ఆ భూములకు ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ముంపుబాధితులకు పరిహారం చెల్లింపుపై నేటి పాలకులు, ప్రభుత్వం చూపుతున్న వైఖరి సరిగ్గాలేదు. – బీమయ్య, మాజీ సర్పంచి, చాపరవారిపల్లె
భూములు సాగుచేసుకోవద్దంటే ఏలా
తరతరాలుగా భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పుడు అటవీశాఖ భూములను సాగుచేసుకునేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టడం అన్యాయం. ఇళ్లకు కూడా పరిహారం ఇచ్చేస్తే గ్రామాలే వదిలి వెళ్లిపోతాం. అప్పటివరకు భూములు సాగుచేసుకునేందుకు అనుమతివ్వాల్సిందే. –ఎం.నారాయణరెడ్డి, పెన్నపేరూరు రైతు